Collector | అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

Collector | అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరిక
Collector | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. ఇవాళ ఆయన గుడిపాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలోని అన్ని విభాగాలను పరిశీలించిన కలెక్టర్, ముఖ్యంగా సంజీవని కార్యక్రమం అమలు, ఓపీ నమోదు స్థాయి, కంప్యూటరైజ్డ్ డేటా లాగిన్ విధానాలను సమీక్షించారు.

రోగులకు అందిస్తున్న మందుల వివరాలు, స్టాక్ రిజిస్టర్లు, డేటా ఎంట్రీపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్, లాగిన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరగాలంటే ఓపీ శాతం పెరగాలని, రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

ఆసుపత్రికి అవసరమైన మౌలిక వసతులను దశల వారీగా కల్పిస్తామని పేర్కొన్న కలెక్టర్, విధులలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని మరోసారి హెచ్చరించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో చంద్రశేఖర్, సిహెచ్ఓ సూర్యనారాయణ, విజయ్, వెంకటేష్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
