Cinema | ఇక ప్రతి ఏటా సినీ అవార్డులు… మురళీమోహన్
- తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం
- ఫిబ్రవరి ఆరో తేదీన సినిమా దినోత్సవం
- వచ్చే ఏడాది ఆ రోజున అవార్డులు ప్రదానం
హైదరాబాద్ : ఇక ప్రతి ఏడాది సినీ అవార్డులు ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది.. వచ్చే ఏడాది నుంచి ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ వివరాలను సీనియర్ సినీ నటుడు మురళీ మోహన్ వెల్లడించారు. నేడు తెలుగు సినిమా దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ జరిగిన కార్యక్రమంలో సీనియర్ నటులు మురళీమోహన్, రచయిత పరిచూరి గోపాలకృష్ణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, రచయిత జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 6ను తెలుగు సినిమా దినోత్సవంగా ప్రకటించింది ఛాంబర్.
ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ… రాజకీయ నాయకులకంటే సినిమా వాళ్లకే ప్రజల్లో ఆదరణ ఎక్కువ అన్నారు. రాజకీయ నాయకుడు పదవికాలం పూర్తయ్యాక ప్రజల్లో ఆదరణ ఉండదన్నారు. క్రీడాకారులకు కూడా ఆదరణ అంతంత మాత్రమేనన్నారు. కానీ సినీ నటులు మాత్రం ఎప్పుడు ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారన్నారు. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మద్రాసులో ఉన్నప్పుడు తాము సినిమా కులమని గర్వంగా చెప్పుకునేవాళ్లమన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6 తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని నిర్ణయం చేసారన్నారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని తెలిపారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని కూడా ఛాంబర్ పిలుపు ఇచ్చిందన్నారు. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించామని మురళీ మోహన్ తెలిపారు.