Chittoor | విధ్వంసమే జగన్ సిద్ధాంతం..

Chittoor | విధ్వంసమే జగన్ సిద్ధాంతం..
- అరాచకమే ఆయన ఆలోచనా విధానం
- మాజీ సీఎం రాజకీయాలు రాష్ట్రానికి ప్రమాదకరం
- టీడీపీ అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్
Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి విధ్వంసమే సిద్ధాంతమని, అరాచకమే ఆలోచనా విధానమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ విమర్శించారు. ఏ రాజకీయ పార్టీకి అయినా సిద్ధాంతం, విలువలు ఉంటాయని, కానీ కేవలం స్వార్థం కోసం ఏర్పడిన పార్టీ వైసీపీ మాత్రమేనని ఆరోపించారు.
ఈ రోజు చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఒక క్రిమినల్ మైండ్‌సెట్‌తో పార్టీని నడిపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ తప్పుడు ప్రచారాలు, ఫేక్ రాజకీయాలు, సొంత మీడియా ద్వారా ప్రజలను మభ్యపెట్టడం వారి విధానమన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వారిలో లేదని, అభివృద్ధి కనిపిస్తే కడుపుమంటతో వ్యతిరేకిస్తారని విమర్శించారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని శాసనసభకు రాకుండా బయట ప్రెస్‌మీట్‌లు పెట్టడం ప్రజాస్వామ్యానికి అవమానమన్నారు.
గత ఐదేళ్ల పాలనలో చెప్పుకోదగిన అభివృద్ధి లేదని, భోగాపురం విమానాశ్రయం, పోలవరం వంటి ప్రాజెక్టులను అడ్డుకున్నారని ఆరోపించారు. పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తే, కంపెనీలకు పెట్టుబడులు పెట్టొద్దని, లేఖలు రాయడం దేశద్రోహ చర్యగా అభివర్ణించారు. ధర్నాలు, ర్యాలీల పేరుతో కార్యకర్తలనే ప్రమాదంలోకి నెట్టడం, రైతుల పంటలను రోడ్లపై పోసి తొక్కించడం అమానుషమన్నారు. నాణ్యత లేని మద్యం, గంజాయి, డ్రగ్స్ ద్వారా రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని సరిచేస్తుంటే మళ్లీ అదే వర్గాలను ప్రోత్సహించడం బాధ్యతారాహిత్యమన్నారు.
రాయలసీమకు ఐదేళ్ల పాటు తీరని ద్రోహం చేసి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, పట్టిసీమ, వెలిగొండ వంటి ప్రాజెక్టులపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ప్రజలు ఇటీవల ఎన్నికల్లో వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. అమరావతి రాజధానిపై మళ్లీ కుట్రలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఓటమిని జీర్ణించుకోలేక అహంకార రాజకీయాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. దేవాలయాల విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
జగన్ రాజకీయ సిద్ధాంతం సెన్సేషన్, డైవర్షన్ పాలిటిక్స్, అభివృద్ధికి అడ్డంకులు సృష్టించడమేనని వ్యాఖ్యానించారు. అధికారంలోకి రావడానికి దేనికైనా తెగించే వ్యక్తి రాష్ట్రానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రజలు వాస్తవం అవాస్తవం తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం సుస్థిరంగా ఉందని, ప్రజల ఆదరణతో దీర్ఘకాలం అధికారంలో కొనసాగుతుందని చెప్పారు. వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి ఇక రాజకీయ భవిష్యత్తు లేదని స్పష్టం చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో టీడీపీ నాయకులు మోహనరాజ్, ధరణీప్రకాష్, గోపాల్, మురుగన్, గోపి, పాండ్యన్ పాల్గొన్నారు.
