మహిళా శక్తికి వందనం..

మహిళా శక్తికి వందనం..

జిల్లా సర్వతోముఖాభివృద్ధిలో భాగస్వామ్యం
చేయూతనిస్తున్న జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ
పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్న డోక్రా మహిళలు
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

చిత్తూరు, ఆంధ్రప్రభ : మహిళల హక్కులు, సమానత్వం, గౌరవం కోసం సాగిన పోరాటాన్ని గుర్తు చేసుకునే మహిళా దినోత్సవం మహిళల సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి ఏడాది మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న అసమానతలను సవాలు చేస్తూ సమాజ నిర్మాణంలో మహిళలు పోషిస్తున్న పాత్రను గుర్తు చేసే సందర్భంగా ఈ దినోత్సవాన్ని భావిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కూడా వివిధ రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతూ సమాజ అభివృద్ధికి కీలకంగా నిలుస్తున్నారు. మహిళల సాధికారతకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ చేయూతనిస్తోంది.

స్వయం సహాయక బృందాలకు భారీగా రుణ సహాయాన్ని అందిస్తోంది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతుంది. మహిళలు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తోంది. డిఆర్డిఏ ఆర్థిక సహాయం స్వయంకృషి ఫలితంగా చిత్తూరు జిల్లాలోని మహిళలు పారిశ్రామికవేత్తలుగా తమ సత్తా చాటుతున్నారు. జిల్లా సర్వతోముఖభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నారు. జిల్లాలోని అన్ని రంగాలలో మహిళలు చొచ్చుకొని పోతున్నారు

అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి గొప్ప చరిత్ర ఉంది. 1908లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో సుమారు 15 వేల మంది మహిళలు పని గంటలు తగ్గించాలని, మెరుగైన వేతనం ఇవ్వాలని, ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆ ఉద్యమ స్ఫూర్తితో 1909లో అమెరికాలో మొదటిసారిగా జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం 1910లో కోపెన్‌హాగన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సులో క్లారా జెట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించాలని ప్రతిపాదించారు. 17 దేశాల నుండి వచ్చిన మహిళా ప్రతినిధులు దీనిని ఏకగ్రీవంగా ఆమోదించడంతో 1911 నుండి ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభమైంది.

1975లో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించి ప్రతి సంవత్సరం నిర్వహిస్తోంది. మహిళల హక్కులు, భద్రత, గౌరవం గురించి ప్రపంచవ్యాప్తంగా ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. అనేక సందర్భాల్లో మహిళలు అన్యాయానికి గురవుతున్నారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు పురుషులతో పోలిస్తే రెండు మూడవ వంతు మాత్రమే చట్టపరమైన హక్కులు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సమానత్వం సాధించడానికి ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చట్టాలు ఉన్నా వాటి అమలు బలహీనంగా ఉండటం వల్ల మహిళలు అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. మహిళలకు న్యాయం అందకపోతే సమాజంలో న్యాయ వ్యవస్థపై విశ్వాసం కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.

నిజమైన న్యాయం అంటే మహిళల గౌరవం, హక్కులు, స్వేచ్ఛలను రక్షించడం మాత్రమే కాదు, అన్యాయానికి గురైన వారికి మద్దతు ఇవ్వడం కూడా. హింస, వివక్ష వంటి సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలు భయపడకుండా పోలీసులను సంప్రదించగలిగే పరిస్థితి ఉండాలి. నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోలేరనే నమ్మకం సమాజంలో ఏర్పడాలి. సమాన వేతనం, విద్య హక్కు, భద్రత వంటి అంశాలు చట్టపరంగా మాత్రమే కాకుండా అమలులో కూడా కనిపించాలి. న్యాయ వ్యవస్థ మహిళలను పక్షపాతం లేకుండా నమ్మాలి. అలాగే ఆర్థికంగా బలహీనమైన మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉండాలి. చిత్తూరు జిల్లాలో మహిళలు వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్నారు.

ఒకప్పుడు ఇంటి పనులకు మాత్రమే పరిమితమైన మహిళలు నేడు వ్యాపార రంగంలో కూడా విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా అనేక గ్రామీణ మహిళలు చిన్న వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా స్వావలంబన సాధిస్తున్నారు. పాలు, పాడి పరిశ్రమ, ఆహార పదార్థాల తయారీ, కుట్టు పరిశ్రమ, చిన్న స్థాయి వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, బ్యాంకు రుణాల సహాయంతో మహిళలు స్వయం ఉపాధిని పెంపొందిస్తున్నారు.

వ్యవసాయ రంగంలో కూడా మహిళల పాత్ర ఎంతో కీలకం. విత్తనం వేయడం నుంచి పంట కోత వరకు మహిళల శ్రమ కనిపిస్తుంది. ఇటీవల మహిళా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను స్వీకరిస్తూ కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. బిందు సేద్యం, సేంద్రీయ వ్యవసాయం వంటి పద్ధతులను అమలు చేస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు. కొందరు మహిళా రైతులు తమ పంటలను నేరుగా మార్కెట్‌కు తీసుకెళ్లి మంచి ఆదాయం పొందుతున్నారు. సాహిత్య రంగంలో కూడా చిత్తూరు జిల్లాకు చెందిన మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారు. కవయిత్రులు, రచయితలు తమ రచనల ద్వారా సమాజంలో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల సమస్యలు, కుటుంబ విలువలు, సామాజిక అసమానతలు వంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. వారి రచనలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

మహిళల హక్కుల కోసం కూడా అనేక మహిళా సంఘాలు పనిచేస్తున్నాయి. గృహహింస, వేధింపులు, వివక్ష వంటి సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలకు మద్దతు అందిస్తున్నారు. చట్టపరమైన సహాయం, కౌన్సెలింగ్ సేవల ద్వారా బాధిత మహిళలకు న్యాయం అందేలా కృషి చేస్తున్నారు. మహిళలు తమ హక్కుల కోసం ధైర్యంగా ముందుకు రావడంలో ఈ సంఘాల పాత్ర ముఖ్యమైంది. మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వహించడమే కాకుండా సమాజ నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక మహిళ బలంగా ఉంటే ఆ కుటుంబం బలంగా ఉంటుంది.

కుటుంబం బలపడితే సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం, వారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం సమాజ బాధ్యతగా నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాలో వివిధ రంగాల్లో కృషి చేస్తున్న మహిళలను గుర్తు చేసుకుంటూ వారికి గౌరవం తెలపడం అవసరమని సామాజిక వర్గాలు భావిస్తున్నాయి. మహిళలను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధిని సాధించగలదని మహిళా దినోత్సవం మరోసారి గుర్తుచేస్తోంది. మహిళల సాధన, పట్టుదల, కృషి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

Leave a Reply