చిట్టీల్లో రూ.4.80 కోట్ల టోకరా

నిందితుడి పట్టివేత.. వెంకటగిరి పోలీసులకు అప్పగింత
( వెంకటగిరి, ఆంధ్రప్రభ): వెంకటగిరి మండలం బొప్పాపురం గ్రామానికి చెందిన ఆలూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి, చిట్టీల పేరుతో కోట్ల రూపాయల మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చిరు వ్యాపారులు, గ్రామస్తుల నమ్మకాన్ని గెలుచుకుని చిన్న చిన్న చిట్టీలతో ప్రారంభమైన ఈ వ్యవహారం, కాలక్రమేణా భారీ స్థాయికి ఎదిగింది. మొదట నమ్మకంగా చిట్టీలు నడుపుతూ డబ్బులను తిరిగి ఇస్తూ, గ్రామంలోని పలువురిని నమ్మించాడు. తర్వాత చిట్టీల మొత్తాన్ని పెద్ద మొత్తాల్లో పెంచుకుంటూ, మొత్తం రూ.4.80 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాడు. అయితే, చిట్టీ ఖాతాదారులకు ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వకుండా, వారికి అందుబాటులో లేకుండా ఎక్కడికో పరారయ్యాడు. గత కొన్ని రోజులుగా వెతుకుతున్న బాధితులు, చివరకు వెంకటేశ్వర్లును గుర్తించి పట్టుకుని వెంకటగిరి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తమ డబ్బు ఇప్పించి న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ బయట బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య తప్పదని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. నిందితుడిని వెంకటగిరి ఎస్సై ఆధీనంలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. పెద్ద ఎత్తున డబ్బులు మాయం అయిన నేపథ్యంలో, మరికొంత మంది బాధితులు ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
