భారతీయ సాహిత్యంలో రామాయణ, మహాభారతాలు వ్యక్తి వ్యక్తిత్వాన్ని వ్యక్తిమత్వంగా తీర్చిదిద్దే ప్రేరణాత్మక గ్రంథాలు. అడుగడుగునా ఎదురయ్యే నకారాత్మక శక్తులతో స#హజీవనం చేస్తూ తమ జీవితాన్ని ఉన్నతీకరించుకునే విధానానికి ప్రతీకలు. సమాజంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో.. ఏయే సన్నివేశాలలో ఎలా స్పందించాలో భావితరాలకు మార్గదర్శన చేసే ఆచార్య పరంపరకు అవి ప్రతీకలు.
రామాయణంలో శ్రీరాముడు ఉత్తమ మానవత్వ విలువలతో కూడిన జీవితాన్ని గడపడం ఎలాగో ఆచరణలో చూపిన ఉదాత్త నాయకుడు. శౌర్యం, సహనం మూర్తీభవించిన ఆదర్శపురుషుడు. మోసంతో తనకు ద్రోహంచేసిన శత్రువును క్షాత్రంతో సాధించిన పరాక్రమశాలి. రాముని వ్యక్తిత్వంలో యువత ఆదర్శంగా తీసుకోదగిన ఒక సన్నివేశాన్ని సమకాలీన సమాజానికి అన్వయించుకుంటే..
రావణుడు రాక్షసరాజు. రాముని భార్య సీతను అపహరించాడు. తన భార్యను అపహరించాడనే దానికన్నా పిరికివానిగా మోసంచేసి సీతను ఎత్తుకుపోయిన రావణుని రాజుగా శిక్షించాలి.. భర్తగా సీతను రక్షించాలి. ఇది రాముని ముందున్న లక్ష్యం. రావణుడు ఎవరో తెలియదు.. సీతను ఎక్కడ పెట్టాడో తెలియదు.. అడవిలో తనకు సహాయపడే వారెవరూ లేరు. సీతను వెదికేందుకు గాని, యుద్ధంచేయడానికి గాని అవసరమైన వనరులు లేవు. అయినా.. ఉద్యమించాడు. సుగ్రీవునికి సహాయపడి అతడందించిన స్నేహ హస్తాన్ని సగౌరవంగా అందుకున్నాడు. సరైన నైపుణ్యాలు లేని వానర సైన్యంతోడుగా సీతను అన్వేషించాడు.. పరిమితమైన వనరులతో సముద్రంపై పటిష్టమైన వారధిని నిర్మించి లంకకు చేరి రావణుని తన పట్టణంలోనే తనవారిముందే ససైన్యంగా, సబాంధవంగా వధించి క్షాత్రాన్ని చూపాడు. జయించిన లంకానగరానికి విభీషణుని రాజుగా ప్రకటించి నిర్మోహత్వాన్ని చాటుకున్నాడు. ఆ సన్నివేశంలో రాముడు ప్రదర్శించిన కొన్ని నాయకత్వ లక్షణాలను పరిశీలిస్తే.. అవి సార్వకాలికమైన, సర్వజనీనమైన లక్షణాలుగా యువతకు ఆదర్శంగా నిలుస్తాయి.
రాముడొక అప్రతిహత నాయకునిగా ఆదరింపబడ్డాడు. హనుమలాంటి విజ్ఞానం, నైపుణ్యాలు కలిగిన సరైన ఉద్యోగిని సరైన కార్యానికి ఎన్నుకోవడం వల్ల సీతాన్వేషణ సజావుగా సాగడమే కాక శత్రువు అనుపానాలు తెలుసుకోగలిగాడు. సుగ్రీవునితో చక్కని మైత్రీబంధాన్ని ఏర్పరుచుకోవడం వల్ల వానర సైన్య స హకారం లభించింది. హనుమలాంటి దౌత్యవేత్త ప్రజ్ఞాపాటవాలను సరిగా ఉపయోగించుకోవడం వల్ల రావణుని బలాబలాలు తెలిసాయి. విభీషణునిలాంటి బుద్ధిజీవులను రావణుని నుండి భేదింపగలిగాడు. ఆధునిక యుద్ధ నైపుణ్యాలు, శిక్షణలులేని వానర సైన్యాన్ని క్రమపద్ధతిలో ఏర్పాటుచేసుకొని నిర్వ హంచుకోవడం వల్ల అపరిమితమైన ఆర్థిక, మానవ వనరులు కలిగిన రాక్షస సైన్యాన్ని ఛేదించడం సాధ్యపడింది. సింహం నాయకుడైతే కుందేళ్ళ సైన్యం కూడా జయిస్తుందనే సామెత ఉన్నది. ఆర్థిక వనరులు అమితంగా ఉండడం కన్నా ఉన్న వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం విజయాన్ని ఇస్తుంది. అడవిలో లభించే పండ్లు, కాయలు ఆహారంగానూ.. రాళ్ళురప్పలు ఆయుధాలుగానూ, మూలికలు ఔషధాలుగానూ అత్యంత ప్రభావవంతంగా ఉపయోగించుకోవడం వల్ల ఆర్థిక వనరుల ఇబ్బందుల నుండి బయటపడగలిగాడు. దాదాపు వందయోజనాల సముద్రాన్ని మామూలు వానరులు దాటలేరు.. అందువల్ల అత్యంత నైపుణ్యంతో కూడిన వారధిని సమద్రంపై అతి తక్కువ సమయంలో నిర్మించి శత్రువును సైతం ఆశ్చర్యపరచాడు. ముఖ్యంగా అత్యంత భద్రతావలయంలో నిర్మితమైన లంకలో శత్రువుయొక్క పట్టణంలో ప్రవేశించి.. అతని స్థానంలోనే అతడిని బంధువర్గంతో సహా మట్టుబెట్టాడు.
రామావతారం పరిసమాప్తికావచ్చు.. కాని భారతదేశంలో ఆ పౌరుషం ఇంకా అస్తమించలేదనే సత్యాన్ని ఈమధ్య కాలంలో పాకిస్థాన్‌పై భారతదేశం సాధించిన విజయం గుర్తుచేస్తున్నది. పిరికిపందలవలె శత్రువులు పహల్గాంలో ప్రవేశించి పర్యాటకులను పొట్టనపెట్టుకున్నారు.. భారతదేశ నాయకత్వం దానిని తీవ్రమైన హయమైన చర్యగా భావించి.. శత్రువును శిక్షించేందుకు అవసరమైన దౌత్యనీతిని ప్రదర్శించి పలుదేశాల మద్దతును కూడగట్టడంలో సఫలీకృతమయింది. సైనిక వ్యూహాలకు పదునుపెట్టి శత్రువు ఊ#హకు కూడా అందనంత వేగంతో, అతి తక్కువ సమయంలో శత్రువు ఆవాసంలోనే శత్రువును శిక్షించింది. అత్యంత అధునాతనమైన ఆయుధాలను ప్రయోగించి.. సైనిక పాటవానికి ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా స్పందించింది. అవసరమైన ఆర్థిక వనరులను పొదుపుగా వెచ్చించి, అతి తక్కువ సమయంలో యుద్ధభూమిలో సైనికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి, సుశిక్షితులైన సైన్యం తమ కర్తవ్యాన్ని సమర్ధవంతంగా, ప్రతిభావంతంగా నిర్వహంచేందుకు సహాయపడింది.
భారతీయ ప్రజ్ఞాపాటవాలను మిత్రదేశాలే కాదు శత్రుదేశాలు కూడా పొగిడే విధంగా ధీపటిమతో పాటుగా నాయకత్వ పటిమను ప్రదర్శించిన భారత శౌర్యదీప్తి అలనాటి శ్రీరాముని ధైర్యసాహసాలకు, నాయకత్వ దక్షతకు ప్రతీకగా నిలుస్తుంది.
– పాలకుర్తి రామమూర్తి