చిట్యాల, ఫిబ్రవరి 26 (ఆంధ్రప్రభ): జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని గిద్ద ముత్తారంకు చెందిన ఓ చిన్నారి పాముకాటుతో మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గిద్ద ముత్తారం గ్రామానికి చెందిన కిన్నెర శిరీష, రాజు దంపతులకు, ఒక కుమారుడు, కుమార్తె కిన్నెర కీర్తన(7) ఉన్నారు. దంపతులు కూలిపని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా, కుటుంబ సమేతంగా ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి నిద్రిస్తుండగా చిన్నారి కీర్తన పాము కాటుకు గురైంది.
దీంతో గమనించిన కుటుంబ సభ్యులు అర్ధరాత్రి చిట్యాల సామాజిక వైద్యశాలకు తరలించారు. వైద్యుల సూచనలతో మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి ప్రభుత్వ వంద పడకల హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజిఎంకు తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు, పాముకాటుతో తమ కళ్ళ ముందే మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో కుటుంబంతో పాటు గిద్ద ముత్తారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
