చర్లగూడెం రిజర్వాయర్.. నల్లగొండ ప్రజల చిరకాల కోరిక

చర్లగూడెం రిజర్వాయర్.. నల్లగొండ ప్రజల చిరకాల కోరిక
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి సాగు నీరందించాలి
సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి
చౌటుప్పల్,ఆంధ్రప్రభ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న చర్లగూడెం రిజర్వాయర్ ను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన డిండి ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన చర్లగూడెం రిజర్వాయర్ పూర్తయితే వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం అవుతాయని, రాచకొండ లో ఎత్తిపోతల ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా నారాయణపురం, చౌటుప్పల్ మండలాల, రైతులకు అనేక గ్రామాలకు సాగునీరు అందించవచ్చని, భూగర్భ జలాలు పెరిగి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు.
ప్లోరిన్ పిడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగు, త్రాగు నీటిని కలగా మార్చవద్దని, ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వాలు ఏదో నామమాత్రపు నిధులు కేటాయిస్తున్నారని, అలా కాకుండా వచ్చే బడ్జెట్ లో ప్రాజెక్టు పూర్తయ్యేందుకు సరిపడే నిధులను మంజూరు చేయాలని అన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి జిల్లా మంత్రులు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు ప్రత్యేక చొరవ చూపాలని, ప్రాజెక్టుల సాధన కోసం గతoలో సిపిఐ పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించడం జరిగిందని, మళ్ళీ ప్రజా పోరాటాలకు కూడా వెనకాడబోమని, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగునీరందించే వరకు విడతల వారీగా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్దె శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, నాయకులు పగిల్ల మోహన్ రెడ్డి, ఉడుత రామలింగం, పొట్ట శంకరయ్య, రొండి నర్సింహా, టంగుటూరి రాములు, నర్సింహా, భాస్కర్, దాసరి మనోహర్, బోయ మంకులు తదితరులు పాల్గొన్నారు.
