Chandra Babu | పేదల జీవితాల్లో మార్పు..

Chandra Babu | పేదల జీవితాల్లో మార్పు..
- ఒంటరి వృద్ధునికి నీడనిచ్చిన పీ-4 ప్రోగ్రామ్
- ఇల్లు కట్టి ఇచ్చిన సర్పంచ్ కుమారుడు
Chandhra Babu, ఘంటసాల, ఆంధ్రప్రభ : పేదరిక నిర్మూలన ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పీ-4 ప్రోగ్రామ్ పేదల జీవితాల్లో మార్పు తెస్తోంది. దాతల ఔదార్యాన్ని పేదల చెంతకు చేర్చే నిజమైన వారధిలా నిలుస్తోంది. ఘంటసాల మండలం వేములపల్లి గ్రామం బీసీ కాలనీకి చెందిన బెజవాడ వీరరాఘవులుకు భార్యాపిల్లలు లేరు. ఆయన కొన్నేళ్ళ నుంచి పూరిపాకలో జీవిస్తున్నాడు. వీరరాఘవులు అవసరాన్ని గుర్తించిన గ్రామ సర్పంచ్ సూర్యదేవర వెంకాయమ్మ కుమారుడు సూర్యదేవర సాంబశివరావు వీరరాఘవులు నివసించే పూరి పాక స్థానంలో రూ.లక్షా 25వేలు వ్యయంతో రేకుల పై కప్పుతో నూతన పక్కా గృహం నిర్మించి ఇచ్చారు. సోమవారం ఈ నూతన ఇంటిని బెజవాడ వీరరాఘవులుకు అవనిగడ్డ నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు సమక్షంలో సూర్యదేవర సాంబశివరావు అప్పగించారు.
ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన పీ-4 ప్రోగ్రామ్ గ్రామాల్లో పేదల అవసరాలను దాతలు నేరుగా గుర్తించి వాటిని తీర్చి, సమాజంలో పేదరిక నిర్మూలనకు మార్గదర్శకులుగా నిలిచే వేదికగా నిలుస్తోందన్నారు. ఒంటరి వృద్ధుడు వీరరాఘవులుకు ఇల్లు కట్టి ఇచ్చిన సర్పంచ్ కుమారుడు సూర్యదేవర సాంబశివరావును ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వాసిరెడ్డి వెంకట్రావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి రావులపల్లి సురేష్ కుమార్, ఏపీఓ రాజ్ కుమార్, నాగరాజు, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
