కార్మికుల పట్ల శ్రద్ధ వహించాలి…

కార్మికుల పట్ల శ్రద్ధ వహించాలి…
- ఎడపల్లి తహసీల్దార్
ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇటుకబట్టి నిర్వాహకులకు ఎడపల్లి తహసీల్దార్ దత్తాద్రి తహశీల్దార్ కీలక సూచనలు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఇటుక బట్టీల నిర్వాహకులు, మీ సేవా నిర్వాహకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ దత్తాద్రి మాట్లాడుతూ.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కార్మికుల ఆరోగ్యం పై ఇటుక బట్టీల నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
మధ్యాహ్న వేళల్లో పనిని తగ్గించి, ఉదయం, సాయంత్రం సమయాల్లో పనులను నిర్వహించాలని చెప్పారు. ప్రతి ఇటుకబట్టిలో తాగునీటి సౌకర్యం, నీడ కోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అలాగే హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైనప్పుడు వెంటనే వైద్య సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చిన్నారుల శ్రమను పూర్తిగా నిషేధించాలని, కార్మికుల భద్రతా పరికరాలు తప్పనిసరిగా వినియోగించాలని స్పష్టం చేశారు.
పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తూ, ధూళి కాలుష్యాన్ని తగ్గించేందుకు నీటిని చల్లడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సూచనలను అమలు చేయడం ద్వారా కార్మికుల ఆరోగ్యం కాపాడటంతో పాటు ఇటుకబట్టి పరిశ్రమ సాఫీగా కొనసాగుతుందని తహశీల్దార్ తెలిపారు. అలాగే ఇటుక బట్టీల కార్మికులు కేంద్రం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇందుకు గాను తమ పేర్లను సమీప మీ సేవా కేంద్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకానికి ఎన్రోల్ చేసుకోవాలని సూచించారు.
తద్వారా ఏవైనా అనుకోని ప్రమాదాలు జరిగితే కేంద్రం వారికి తదానుగుణంగా సహాయక చర్యలు చేపడుతుందని తెలిపారు. అలాగే మహిళా కార్మికులు గర్భవతులు ఐతే సహాయం కింద 30 వేలు, అలాగే బిడ్డ పుట్టిన అనంతరం మరో 30 వేలు, మహిళా కార్మికులు వారి పిల్లల పెళ్లి సమయం లో 30 వేలు కేంద్రం అందిస్తుందని తెలిపారు. తక్షణమే కార్మికులు కేంద్ర ప్రభుత్వ పథకానికి ఎన్రోల్ అయ్యే విధంగా ఇటుక బట్టిల యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమం లో మండల వైద్యాధికారి వినీత్ రెడ్డి సైతం పాల్గొని కార్మికులు ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. కార్యక్రమం లో రెవెన్యూ, ఐసిడిఎస్, వైద్య సిబ్బంది, మీ సేవా నిర్వాహకులు, ఇటుక బట్టీల నిర్వాహకులు పాల్గొన్నారు.
