Guntur | రాజధాని భూ సమస్యలకు త్వరలో పరిష్కారం

Guntur | రాజధాని భూ సమస్యలకు త్వరలో పరిష్కారం
- కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని
Guntur | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : అమరావతి రైతుల భూ సమస్యల పరిష్కారాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పెమ్మసాని చర్యలు మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలో గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పి. నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తదితర ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష జరిపారు. గతవారం సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను సమీక్షించడంతో పాటు, రాబోయే వారంలో జరిగే తదుపరి సమావేశంలో రైతులకు వివరించాల్సిన కీలక విషయాలపై విస్తృతమైన చర్చ ఈ సమావేశంలో జరిగింది.
రైతులు ఎదుర్కొంటున్న అసైన్డ్ భూములు, లంక భూములు, జరీబు–మెట్ట భూముల సమస్యలు, ప్లాట్ల విభజన, గ్రామ కంఠం, రాజధానికి సంబంధించిన ఆర్ అండ్ బీ రహదారుల అభివృద్ధి, టీడీఆర్ బాండ్లు, వీధి పోటు వంటి అంశాలపై పెమ్మసాని అధికారులు, కాంట్రాక్టర్లతో కూడిన టైం-బౌండ్ పనుల అమలు పరిస్థితిని ఆరా తీశారు. ప్రభుత్వ గైడ్‌లైన్ల ప్రకారం తదుపరి సమావేశంలో రైతులకు పూర్తి వివరాలు అందించేందుకు అవసరమైన మినహాయింపులు, విధాన అంశాలను కూడా పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ కూడా కమిషనర్ కన్నబాబు నుంచి ఇప్పటివరకు జరిగిన పనులపై సమగ్ర నివేదిక తీసుకుని, పెమ్మసానితో కలిసి పరిష్కార మార్గాలపై చర్చించారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ.. అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారి సమస్యలకు త్వరలోనే స్పష్టమైన పరిష్కారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే ఆరు నెలల్లో రాజధానికి అవసరమైన మౌలిక సదుపాయాలను వేగవంతంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. మరో నాలుగు రోజుల్లో జరగబోయే రెండో దశ సమావేశంలో రైతులకు మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్టు కూడా ఆయన స్పష్టం చేశారు.
