రోహతక్ – హర్యానా : కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ (23) హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. మార్చి 1న హర్యానాలోని రోహ్‌తక్-ఢిల్లీ హైవేలోని సంప్లా బస్టాండ్ సమీపంలో సూట్‌కేస్‌లో నర్వాల్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసు దర్యాప్తు కోసం హర్యానా ప్రభుత్వం ఆదివారం సిట్ ఏర్పాటు చేసింది. ఇక రంగంలోకి దిగిన సిట్ బృందం.. సోమవారం ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు ఝజ్జర్‌గా గుర్తించారు. నిందితుడు… నర్వాల్‌కు పరిచయం ఉన్న వ్యక్తేనని పోలీసులు తెలిపారు. అయితే హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు నిందితుడిని పోలీస్ కస్టడీ కోరతామని సిట్ తెలిపింది. ఇద్దరి మధ్య వ్యక్తిగత ఘర్షణ ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నర్వాల్ రోహ్‌తక్‌లోని విజయ్ నగర్‌లో నివసిస్తోంది. శనివారం రోహ్‌తక్ జిల్లాలో సూట్‌కేస్‌లో ఆమె మృతదేహం దొరికింది. శరీరంపై గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఇదిలా ఉంటే హంతకులను అరెస్ట్ చేసే వరకు దహనం చేయమని బాధితురాలి తల్లి కన్నీటి పర్యంతమైంది. కాంగ్రెస్‌లో తమ కుమార్తె ఎదుగుదలను ఓర్వలేకే ఈ హత్యకు పాల్పడ్డారని బాధితురాలి తల్లి సవిత పేర్కొంది. తమ కుమార్తె పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తుందని.. రాహుల్ గాంధీ జోడో యాత్రలో కూడా చురుగ్గా పాల్గొందని గుర్తుచేసింది. పార్టీ కోసం తమ కుమార్తె జీవితం అంకితం చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది.