Bheemavaram | అఖిలభారత సార్వత్రిక సమ్మెను బలపరచాలి

Bheemavaram | అఖిలభారత సార్వత్రిక సమ్మెను బలపరచాలి

Bheemavaram | భీమారం, ఆంధ్ర ప్రభ : ఫిబ్రవరి 12న జరగనున్న కార్మికుల అఖిల భారత సార్వత్రిక సమ్మెను బలపరచాలని యూసీసీఆర్‌ఐ (ఎం-ఎల్) జిల్లా నాయకుడు ఇల్లందుల శోభన్‌బాబు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ కేంద్ర ట్రేడ్ యూనియన్ల జాతీయ వేదిక, ఇతర కార్మిక ఉద్యోగి సంఘాల పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ సమ్మెకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ కోడ్లు కార్మికుల హక్కులను హరించేవిగా పెద్ద పెట్టుబడిదారులు, విదేశీ మూలధన ప్రయోజనాలను కాపాడేవిగా ఉన్నాయని విమర్శించారు. రైతాంగం కార్మికులు మధ్యతరగతి వర్గాల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. దేశంలో మౌలిక మార్పు రావాలంటే జనతా ప్రజాస్వామిక విప్లవం అవసరమని శోభన్‌బాబు పేర్కొన్నారు. భూస్వామ్య విధానాన్ని రద్దు చేసి దున్నేవారికి భూమి పంచాలని కార్మికుల పని,పరిస్థితులు మెరుగుపడేలా తగిన జీతభత్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

అదే విధంగా ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేసే నిర్బంధ చట్టాలను రద్దు చేయాలని వివిధ ప్రాంతాల్లో అమలవుతున్న పోలీసు, సైనిక నియంత్రణకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక స్వావలంబనను సాధించేందుకు జాతీయ పరిశ్రమలకు రక్షణ కల్పించాలని సామ్రాజ్యవాద అనుకూల ఆర్థిక విదేశాంగ విధానాలను విరమించాలని సూచించారు. విద్యా సాంస్కృతిక రంగాల్లో ఫ్యూడల్ సామ్రాజ్యవాద ప్రభావాలను తొలగించి ప్రజాస్వామ్య జాతీయ భావజాలాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని అన్ని జాతుల ప్రజల ఐక్యతను బలోపేతం చేస్తూ వారి భాషలు సంస్కృతుల అభివృద్ధికి కట్టుబడాలని పిలుపునిచ్చారు.ఫిబ్రవరి 12న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గం పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం ప్రకటించాలని ఇల్లందుల శోభన్‌బాబు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply