AP | చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో త‌ల‌ పెట్టడమే – జ‌గ‌న్

తాడేప‌ల్లి : చీటింగ్‌లో సీఎం చంద్రబాబు పీహెచ్‌డీ చేశారంటూ ఎద్దేవా చేశారు వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్. చంద్ర‌బాబు వ్యవహారశైలి వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఆవిరవుతోంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.. ఈ ముఖ్య‌మంత్రి నటన ముందు ఎన్టీఆర్ కూడా పని చేయరని, ఆయనకు అవార్డు ఇవ్వాల్సిందేనన్నారు. తాడేప‌ల్లిలోని ఆయ‌న నివాసంలో ఇవాళ‌ మీడియాతో మాట్లాడుతూ… అప్పుల్లో కూటమి ప్రభుత్వం రికార్డ్ బద్దలు కొట్టిందని, 9 నెలల్లోనే రూ.80వేల కోట్లు అప్పు తెచ్చిందని.. అమరావతి నిర్మాణం పేరుతో మరో రూ.52వేల కోట్ల అప్పులు చేయడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తానని స్పష్టం చేశారు.

కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చి 9నెలలు అవుతుందని.. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారంటీ’ అని ప్రచారం చేశారని.. 9 నెలల తర్వాత బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీగా మారిందని జగన్ విమర్శించారు. బటన్‌ నొక్కడం పెద్ద పనా అని ఆరోజు మాట్లాడారని, ముసలోళ్లు కూడా బటన్‌ నొక్కుతారంటూ తమపై విమర్శలు చేశారన్నారు. సూపర్‌ సిక్స్‌ అంటూ ఇంటింటా ప్రచారం చేశారని, ‘నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు’ అంటూ ప్రచారం చేశారని, హామీలపై ఇంటింటికీ బాండ్లు కూడా ఇచ్చారన్నారు. అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయమన్నారని.. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు, బాండ్లు ఏమయ్యాయని జగన్ నిలదీశారు.

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా కుదించేస్తున్నారని ప్రస్తుతం చేసిన, చోయబోతున్న అప్పులు రూ.1.45లక్షల కోట్లకుపైనే ఉన్నాయని జగన్ అన్నారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్‌ సిక్స్‌ ఇచ్చారా? అని ప్రశ్నించారు. పథకాలు ఏవీ అమలు కావడం లేదని, మరి రూ.1.45 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని అన్నారు. కొత్త ఉద్యోగాలు ఇచ్చింది లేదు కానీ ఉన్న ఉద్యోగాలు తీసేశారని విమర్శించారు. 2 లక్షల 60 వేల మంది వలంటీర్ల ఉద్యోగాలు తీసేశారని, మద్యం షాపుల్లో పనిచేసే 18 వేల మంది ఉద్యోగాలు పోయాయని జగన్ ఆరోపించారు.

చంద్ర‌బాబు ఓ చంద్ర‌ముఖి…
టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో త‌ల‌ పెట్టడమేనన్నారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమేనన్నారు. గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దేస్తున్నారని తెలిపారు. ఆర్థిక విధ్వంసం ఎవరిదో ఒక్కసారి చూడాలన్నారు. గతంలో సీఎం చంద్రబాబు దావోస్‌కి వెళ్లినప్పుడు చెప్పిన మాటలను పేపర్ కటింగులను చూపించారు. అబద్దాలు, మోసాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా చెప్పుకొచ్చారు జగన్. ఈసారి దావోస్‌కు వెళ్లినప్పుడు ఒక్క ఎంవోయూ జరగలేదన్నారు. పెట్టుబడులు పెడతామని జిందాల్ లాంటి సంస్థలు వస్తే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారని అన్నారు జగన్.

వారిపై కేసులు పెట్టి భయపెట్టారన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రీసెంట్‌గా విశాఖలో ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేసినవన్నీ వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన ప్రాజెక్టులేనని చెప్పే ప్రయత్నం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌కు విలువైన ప్రాజెక్టులు వచ్చాయని, సీఎం చంద్రబాబు ఏం చేశారంటూ దుయ్యబట్టారు. ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారంటూ దుయ్యబట్టారు. కావాల్సిన మెడికల్ సీట్లు ఇస్తామని కేంద్రం చెబుతున్నా, అవసరం లేదని లేఖ రావడం విధ్వంసం కాదా అంటూ రుసరుసలాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *