అపోహలు నమ్మొద్దు : ఎస్సై రవికుమార్

జైనూర్, ఆంధ్రప్రభ : దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమృద్ధిగా ఉన్నప్పటికీ కొంతమంది వ్యాపారులు అపోహలు సృష్టిస్తూ నిల్వలు చేసి కృత్రిమ కొరత ఏర్పరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ఎస్సై రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

జైనూర్ మండల ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇటీవల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగించడం, నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్ చేయడం వంటి చర్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎవరైనా అధిక ధరలకు బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గృహ వినియోగానికి మాత్రమే కేటాయించిన ఎల్పీజీ సిలిండర్లను హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాలు వంటి వాణిజ్య స్థలాల్లో వినియోగించడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఇటువంటి చర్యలు ఎస్సెన్షియల్ కమోడిటీస్ చట్టం, 1955 మరియు ఎల్పీజీ (సరఫరా & పంపిణీ నియంత్రణ) ఆర్డర్, 2000 ప్రకారం శిక్షార్హమైన నేరాలని పేర్కొన్నారు.

ఇటీవల వివిధ ప్రాంతాల్లో పోలీసులు అక్రమ ఎల్పీజీ రీఫిల్లింగ్ గోదాములను గుర్తించి వందల సంఖ్యలో సిలిండర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

అవసరానికి మించిన ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వలు చేయడం నేరమని, అక్రమ రీఫిల్లింగ్, నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు.

ప్రజలు అపోహలకు లోనుకాకుండా అవసరానికి మించిన నిల్వలు చేయరాదని సూచించారు. జైనూర్ పోలీసులు సివిల్ సప్లైస్ శాఖతో కలిసి ప్రత్యేక దాడులు నిర్వహిస్తూ అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

ఎవరైనా ఎల్పీజీ అక్రమ వినియోగం లేదా నిల్వలు చేస్తున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల భద్రత, సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.

Leave a Reply