గుంటూరు: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి సీఐడీ కేసులో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన కోర్టు.. ఈరోజు(శుక్రవారం) బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మురళి బెయిల్ పిటిషన్పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా . న్యాయస్థానం ఇవ్వాల్టికి వాయిదా వేసింది.
కోర్టు ఉత్తర్వుల మేరకు గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఆయన్ను మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సీఐడీ పోలీసులు జీజీహెచ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.2 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఫర్ ప్రొహిబిషన్/ఎక్సైజ్ కోర్డులో హాజరుపరిచారు. అక్కడ్నుంచి పోసానిని తిరిగి గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. ఈ కేసులో బుధవారం కోర్టులో విచారణ జరిగింది. శుక్రవారం తిరిగి విచారించిన కోర్టు.. పోసానికి షరతులతో బెయిల్ మంజూరు చేసింది.