no stock | సీఎన్‌జీ కోసం ఆటోవాలా కష్టాలు

no stock | సీఎన్‌జీ కోసం ఆటోవాలా కష్టాలు
అనేక ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు
గంటల తరబడి బంకుల వద్ద ఆటోల బారులు
అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
గ్యాస్ నింపుకోవడానికి సుమారు 8 నుండి 10 గంటల సమయం
జీవనోపాధికి పెద్ద దెబ్బ
ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఆందోళన
ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా గ్యాస్ దిగుమతులపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో పర్యావరణ హితమని భావించి సీఎన్‌జీ వాహనాలను కొనుగోలు చేసిన యజమానులకు ప్రస్తుతం తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా సీఎన్‌జీ గ్యాస్ కోసం ఆటోవాలాలు అష్టకష్టాలు పడుతున్నారు. గ్యాస్ కోసం బంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. పది రోజులుగా నగరంలోని సీఎన్‌జీ స్టేషన్ల వద్ద “నో స్టాక్” బోర్డులు దర్శనమిస్తుండటంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ కోసం తెల్లవారుజాము నుంచే బంకుల వద్ద బారులుదీరుతున్నారు. కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. గ్యాస్ నింపుకోవడానికి సుమారు 8 నుండి 10 గంటల సమయం పడుతుందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తిండి, నిద్ర మానుకుని గంటల తరబడి వేచి ఉన్నా, తమ వంతు వచ్చేసరికి ‘స్టాక్ అయిపోయింది’ అని బోర్డులు పెట్టడంతో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరోజు గ్యాస్ కోసం క్యూలో నిలబడితే, మరుసటి రోజు మాత్రమే బండి బయటకు రాగలుగుతున్నామని లక్డీకాపూల్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత కారణంగా జీవనోపాధి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ నింపుకోవడానికి ఇన్ని గంటలు కేటాయిస్తే ఇక కిరాయిలు ఎలా తోలుకోవాలని బోరుమంటున్నారు. ఇదే అదనుగా కొన్ని చోట్ల నిర్ణీత ధర కంటే కిలోకు రూ. 20 నుండి రూ. 30 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్యాస్ కొరత నిజంగానే ఉందా.. లేదంటే కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అనే దానిపై అధికారులు నిఘా పెట్టాలని ఆటోవాలాలు కోరుతున్నారు.

వనస్థలిపురం, లక్డీకాపూల్, మెహిదీపట్నం, కూకట్‌పల్లి, ఉప్పల్, మియాపూర్, ఆసిఫ్‌నగర్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై సీఎన్‌జీ కోసం ఆటోలు, కార్లు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. నగరంలో సుమారు 90 వేల సీఎన్‌జీ ఆటోలు ఉన్నాయి. గ్యాస్ కోసం రోజంతా బంకు వద్దే ఉండాల్సి రావడంతో రోజువారీ కిరాయిలు రాక కుటుంబ పోషణ భారమవుతోందని డ్రైవర్లు వాపోతున్నారు. సీఎన్‌జీ క్యాబ్‌లు గ్యాస్ దొరకక షెడ్లకే పరిమితమవుతున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా గ్యాస్ సంక్షోభంపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.

