Assembly – కుల‌గ‌ణ‌న స‌ర్వేలో పాల్గొన‌ని రాజ‌కీయ ప్ర‌ముఖులు వీరే…

హైద‌రాబాద్ – ఆంధ్ర‌ప్ర‌భ – సామాజిక కులగణన సర్వేలో అనేక మంది ప్రముఖులు పాల్గొనలేదని అసెంబ్లీలో తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం ఇంటింటి సర్వే చేస్తే కొందరు ప్రముఖులు ఈ సర్వేలో పాల్గొనలేదన్నారు. అసెంబ్లీలో నేడు జ‌రిగిన కుల‌గ‌ణ‌న స‌ర్వేపై చ‌ర్చ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, సర్వేలో పాల్గొనని వారు ఎవరెవరో పేర్లతో సహా సభ ముందు పెట్టారు . బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, తన్నీరు హరీష్ రావు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సర్వేలో పాల్గొనలేదని అన్నారు. ఇదే విషయంపై పలువురిని అడిగితే ‘‘నువ్వు ఇచ్చిన సర్వేలో ఐదో పేజీలో భూమి వివరాలు అడిగాం. ఒక్క దెబ్బకు ఎవరూ సమాచారం ఇవ్వలేదు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూడు కోట్ల 54 లక్షల మంది సర్వేలో పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులంతా వివరాలు ఇచ్చారని తెలిపారు. కానీ భూముల వివరాలు అడిగినందుకే కొందరు సర్వేలో పాల్గొనకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంత ముఖ్యమైన చర్చలో తప్పుడు నివేదకలు తీసుకువచ్చి రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు.

తాము చెప్పిన ప్రకారం 15 శాతం ఓసీలు ఉంటే, ఓసీలు 21శాతం అంటూ తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీ జనాభా 51 శాతం అని.. మేం చేసిన సర్వే ప్రకారం బీసీ జనాభా 56 శాతంగా ఉందన్నారు. సర్వేపై అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పాయల్ శంకర్ అపోహలు సృష్టించేలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేశారు.

1930 నుంచి ప్రతీ పది సంవత్సరాలకు జనాభా లెక్కలు చేశారని తెలిపారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యత స్వీకరించక ఈరోజు వరకు జనాభా లెక్కలు చేయడం లేదని అన్నారు. బలహీన వర్గాలకు వారి హక్కులు ఇవ్వడం బీజేపీ ఇష్టం లేని కారణంగా జనాభా లెక్కలు చేయడం లేదని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చాక 70 సంవత్సరాలు కొనసాగిన జనాభా లెక్కల ప్రక్రియ మోదీ ప్రధాని అయ్యాక ఎందుకు జరగడం లేదని నిలదీశారు. 2024లో చేపట్టిన ఈ లెక్కలే.. అధికారిక లెక్కలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారికంగా సేకరిస్తున్న సమాచారాన్ని ప్రజాప్రతినిధులుగా ఉండే పక్కదారి పట్టించి… వివరాలు ఇవ్వకుండా సభలో తప్పుడు లెక్కలు చూపుతున్నారని మండిపడ్డారు. సర్వలో పాల్గొనని ఎమ్మెల్యేలు సర్వేలో పాల్గొని వివరాలు ఇవ్వాలన్నారు. ఇన్ని సంవత్సరాలు ఆలస్యమైనప్పటికీ ఇప్పటికైనా బలహీన వర్గాల కోసం పనిచేద్దామని అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *