ప్రచార పర్వంలో నువ్వానేనా
- అమీతుమీకి త్రిముఖ పోటీ
- కాంగ్రెస్.. బీఆర్ఎస్.. బీజేపీ రెఢీ
తెలంగాణ, ఆంధ్రప్రభ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి : విశ్వనగరి.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ సిటీ(Hyderabad City) పరిధిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. సాధారణంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా రాజకీయ చదరంగం జరుగుతుంది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం రణరంగమే కాబోతుంది.
2008లో నియోజకవర్గాల పునర్విభజన భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడ 2009లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించి అసెంబ్లీ(Assembly)లో అడుగు పెట్టారు. 2014లో తెలుగుదేశం అభ్యర్థి మాగంటి గోపినాథ్(Maganti Gopinath) విజయం సాధించారు. తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్లో చేరిన మాగంటి 2018లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా విజేతగా నిలిచిచారు.
అదే పార్టీ అభ్యర్థిగా 2023లోనూ విజయం సాధించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీత(Sunitha) బీఆర్ఎస్ పార్టీ తరుఫున నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి(Lankala Deepak Reddy) నామినేషన్లు వేశారు. వీరితోపాటు 211 మంది 321 నామినేషన్లు వేశారు. రేపు నామినేషన్ల ఉపసంహరణకు ఎంత మంది బరిలో ఉంటారన్నది వేచి చూడాలి. ఎంత మంది ఉన్నా ఎన్నికలు మాత్రం ఈవీఎంను ఉపయోగిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎంత మంది బరిలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ అనివార్యమని పరిశీలకులు భావిస్తున్నారు.
అమీ తుమీ ..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడు పార్టీలు అమీతుమీ తేల్చుకునే రీతిలో పోరాడుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నకాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చతికిల పడిన బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో తమ సత్తా నిరూపించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి, 2024 లోక్‌సభ(Lok Sabha) ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కక నీరసపడిన బీఆర్ఎస్ ఈ సారి ఉప ఎన్నికల్లో తమ సిట్టింగ్ సీటును దక్కించుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. ముందుగా టికెట్ ప్రకటించి, అవసరం అయితే ఉప ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును తీసుకు రావాలన్న ఆలోచన చేస్తున్నారు.
ఇప్పటికే పలుమార్లు కేసీఆర్(KCR)తో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు భేటీ అవుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నాయకులను తీసుకు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి ఆ పార్టీ సన్నహాలు చేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికారంలో ఏ పార్టీ ఉంటే వారికే ఓటర్లు పట్టం కడతారు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు.
ఈ ఎన్నికను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిష్థాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులతో పలు మార్లు సమావేశమయ్యారు. ఈ ఎన్నికల ప్రచారానికి మంత్రులతోపాటు ఎమ్మెల్యేలను కూడా దించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని తెలిసింది. అందుకు ఓ ప్రణాళిక కూడా సిద్ధమైంది. ఈ నియోజకవర్గం సీటును దక్కించుకోవాలని ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రతిపక్షాల నోరు మూయించొచ్చు అని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ(BJP) కూడా ప్రతిష్థాత్మకంగా తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది లోక్‌సభ స్థానాలు సంపాదించిన బీజేపీ అదే ఉత్సహంతో జూబ్లీహిల్స్ స్థానం దక్కించుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నం సాగిస్తోంది. గత ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్‌కు 80,549 (43.94%) ఓట్లు లభించగా, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కు 64,212(35.03% ), బీజేపీ అభ్యర్థి 25,866 (14.11%) ఓట్లు లభించాయి. ఈ సారి జూబ్లీని ఎవరు దక్కించుకుంటారో ఎదురు చూడాలి.