AP | అరసవల్లి సన్నద్ధం

AP | అరసవల్లి సన్నద్ధం

  • రథ సప్తమి ఏర్పాట్లపై శ్రీకాకుళం ఎస్పీ, ఎమ్మెల్యే సమీక్ష
  • పకడ్బందీ బందోబస్తుపై దృష్టి

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉత్సవాలు ఎలాంటి అంతరాయం లేకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం ఆలయ పరిసర ప్రాంతాలను సందర్శించి జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు.


భారీగా భక్తులు రావడం పైన వాహన రద్దీ అధికంగా ఉండే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ డైవర్షన్లు, భక్తుల రాకపోకలు సులభం అయ్యేలా ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ స్థలాలు, అత్యవసర సేవలు, ఆరోగ్య బృందాలు, వైద్య శిబిరాలు, అగ్నిమాపక సిబ్బంది వంటి అన్ని విభాగాల ఏర్పాట్లను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు.

భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున భారీ రద్దీ నమోదవుతోందని, గతంలో ఎక్కడ సమస్యలు ఎదురయ్యాయో అవి రిపోర్టుల రూపంలో మా వద్ద ఉన్నాయని తెలిపారు. వాటిని అధ్యయనం చేసి ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తుల భద్రత మా ప్రథమ కర్తవ్యమని, పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది, ప్రత్యేక బృందాలు 24 గంటలు విధుల్లో ఉంటాయని తెలిపారు.


ఎమ్మెల్యే గోండు శంకర్ మాట్లాడుతూ, సూర్యనారాయణ స్వామి రథసప్తమి జిల్లా ప్రజలకు అత్యంత ముఖ్యమైన ఉత్సవమని, భక్తుల సౌకర్యం కోసం నీరు, శానిటేషన్, టెంట్లు, విశ్రాంతి గదులు, వైద్య సేవలు, ప్రకటనా వ్యవస్థ వంటివి శాశ్వత, తాత్కాలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామన్నారు. ఏ శాఖలోనూ నిర్లక్ష్యం ఉండకుండా ప్రతి అధికారి తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు.


అదనపు పోలీసు సిబ్బందిని ఇతర మండలాల నుండి కేటాయించడం, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, డ్రోన్ కెమెరాల ద్వారా జనసందోహంపై నిఘా, ట్రాఫిక్ నియంత్రణ కోసం బారికేడింగ్, అత్యవసర మార్గాలను ఖాళీగా ఉంచడం వంటి కీలక అంశాలను ఎస్పీ స్వయంగా పరిశీలించారు.
ఉత్సవానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం తాగునీటి బండ్లు, వైద్య బృందాలు, అంబులెన్సులు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని అధికారులు స్థానిక సిబ్బందికి సూచనలు చేశారు. అదేవిధంగా, మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీమ్స్, చైల్డ్ హెల్ప్ బూత్స్ కూడా ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు.


ఆలయ ఈఓ ప్రసాద్ మాట్లాడుతూ, రథసప్తమి రోజున లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉందని,. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాశ్వత, తాత్కాలిక సదుపాయాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్యూలైన్ షెల్టర్లు, తాగునీటి సదుపాయాలు, అత్యవసర వైద్య సేవలు, పార్కింగ్ ప్రాంతాలు, స్నాన ఘాట్లు, శానిటేషన్ ఏర్పాట్లు అన్నీ సమగ్రంగా చేయబడుతున్నాయని తెలిపారు.స్థానిక అధికారులు, దేవస్థాన కమిటీ సభ్యులు, పోలీసు ఉన్నతాధికారులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు. రథసప్తమి రోజున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోందని ఎమ్మెల్యే తెలిపారు.

Leave a Reply