హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : భారతదేశంలో అతిపెద్ద రైడ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ అయిన రాపిడో, మహిళలకు అర్థవంతమైన జీవనోపాధి అవకాశాలను సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్(మెప్మా)తో చేతులు కలిపింది.
అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ద్వారా అధికారికీకరించబడిన ఈ భాగస్వామ్యం ద్వారా, స్వయం సహాయక బృందాల సభ్యులు చలనశీలతరంగంలో స్వయం సమృద్ధిగల సూక్ష్మ వ్యవస్థాపకులుగా మారడానికి వీలు కల్పించడం ద్వారా మద్దతు ఇవ్వడం రాపిడో లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేష్రన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్(ఎంఏయూడీ) విభాగం కింద మెప్మా, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సాధికారత ద్వారా మహిళల జీవితాలను మెరుగు పరచడానికి చురుకుగా పని చేస్తోంది. రాపిడోతో భాగస్వామ్యం ద్వారా, మహిళలు చలనశీల శ్రామికశక్తిలో ఏకీకృతం కావడం ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం పొందడంలో సహాయపడటానికి మెప్మా మరో ముఖ్యమైన అడుగు వేస్తోంది.
ఈ భాగస్వామ్యం యొక్క ప్రధాన లక్ష్యం రాపిడో యొక్క పింక్ మొబిలిటీ కార్యక్రమం. ఇది మహిళల ద్వారా, మహిళల కోసం సురక్షితమైన, సమ్మిళితమైన, ఆర్థికంగా లాభదాయకమైన రవాణా పరిష్కారాన్ని సృష్టించడంపై దృష్టి పెట్టింది.
ఈ సందర్భంగా కార్యక్రమ ఉద్దేశాన్ని ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ అంతటా స్వావలంబన కలిగిన మహిళా సూక్ష్మ వ్యవస్థాపకులకు మద్దతునివ్వడానికి కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వాహనాలను సమకూర్చుకోవడానికి ఆర్థిక సహాయం అందించడానికి సంతోషిస్తున్నామని ఆయన తెలిపారు.
మెప్మా డైరెక్టర్ ఎన్.తేజ్ భరత్ మాట్లాడుతూ మెప్మా, రాపిడోతో భాగస్వామ్యం ద్వారా సెల్ప్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్య శిక్షణ, ఆర్థిక అక్షరాస్యతతో మరింత సాధికారత కల్పించడం, వారికి విజయం, అభివృద్ధి చెందడానికి ఒక వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
రాపిడో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అరవింద్ సంక మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సెల్ప్ హెల్ప్ గ్రూప్ మహిళలకు మద్దతు ఇవ్వడానికి, మైక్రో మొబిలిటీ రంగంలో అభివృద్ధి చెందడానికి నైపుణ్యాలు, అవకాశాలతో వారిని సన్నద్ధం చేయడానికి మెప్మాతో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.