AP | మెగా డీఎస్సీకి స‌న్న‌ద్ధం … 16,247 టీచ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి చ‌ర్య‌లు

మార్చిలో నోటిఫికేష‌న్ ఇచ్చందేకు స‌న్నాహాలు
జూన్ నాటికి నియామ‌క ప్ర‌క్రియ పూర్తి చేస్తాం
జీఓ 117కు ప్ర‌త్యామ్నాయం తీసుకొస్తాం
విద్యాశాఖ కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్ వెల్ల‌డి

వెలగపూడి, ఆంధ్రప్రభ : నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. 16,247 టీచ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ బుధవారం వెల్ల‌డించింది. జూన్ నాటికి నియామ‌క ప్ర‌క్రియ పూర్తి చేస్తామ‌ని తెలిపింది. జీఓ 117కు ప్ర‌త్యామ్నాయం తీసుకొస్తామని పేర్కొంది. గ‌తంలో టీచ‌ర్లకు 45 ర‌కాల యాప్​లు ఉండేవ‌ని, వాటన్నింటినీ క‌లిపి ఒకే యాప్​గా మార్చేశామ‌ని విద్యాశాఖ కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్ తెలిపారు. అలాగే త్వ‌ర‌లో టీచ‌ర్ల బ‌దిలీల చ‌ట్టం తేనున్నట్లు వెల్ల‌డించారు.

న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా..

ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లామ‌ని, వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో దీనిపై బిల్లు పెడ‌తార‌ని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్​ చెప్పారు. వీసీల నియామ‌కం పూర్త‌య్యాక అన్ని విశ్వ‌విద్యాల‌యాల‌కు ఏకీకృత చ‌ట్టం అమ‌లు చేస్తామ‌న్నారు. ఇక మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న విద్యాశాఖ.. ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు లేకుండా ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతోంది. కాగా, 16,247 ఉపాధ్యాయ‌ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)- 7,725, సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్లు (ఎస్‌జీటీ)- 6,371, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ)- 1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (పీజీటీ)- 286, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీ)- 132, ప్రిన్సిపాల్స్- 52 పోస్టులు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *