ఆంధ్రుల శాశ్వత రాజధాని అమరావతి..

ఆంధ్రుల శాశ్వత రాజధాని అమరావతి..

పాయకాపురం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఖరారు కావడం శుభపరిణామమని, ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి మరియు రాజధాని రైతుల సుదీర్ఘ త్యాగ ఫలితమని ఏపీ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, సింగ్ నగర్ పైపుల రోడ్డులోని లైఫ్ స్టైల్ హెయిర్ సెలూన్ వద్ద శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

గత ప్రభుత్వ విధానాలపై విమర్శ:

ఈ సందర్భంగా సదాశివం మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం ఆవేదన కలిగించిందన్నారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ‘మూడు రాజధానుల’ పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేసిందని విమర్శించారు. ఈ అనిశ్చితి వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులు వీధిన పడి పోరాడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

న్యాయం గెలిచింది:

రైతులు ‘దేవస్థానం నుండి న్యాయస్థానం’ వరకు చేసిన ధర్మపోరాటం, చంద్రబాబు నాయుడు పట్టుదల వెరసి నేడు అమరావతి చట్టబద్ధమైన శాశ్వత రాజధానిగా అవతరించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ అమరావతికి తిరుగులేని మద్దతు లభించిందని, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటం కూడా కేవలం లాంచనమేనని తెలిపారు. జూన్ 2, 2024 నుండి అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా సుస్థిర స్థానాన్ని పొందిందని స్పష్టం చేశారు.

అభివృద్ధి పథంలో అమరావతి:

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతి ప్రాధాన్యతను గుర్తించాయని, ఇకపై రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతుందని సదాశివం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది తెలుగు వారందరూ గర్వించదగిన రోజని ఆయన కొనియాడారు.

ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సురవరపు నాగరాజు, పేకేటి సత్యనారాయణ, వేపాడ రమణ, దొడ్డి చింతల రాజేష్, గుండ్లపాక శ్రీకాంత్, పొట్నూరి జగన్ మోహన్ రావు, ఇనుపకుర్తి సత్యనారాయణ, కొమ్మోజి సందీప్, పేకేటి ప్రభు, పుల్లేటికుర్తి సతీష్, పేకేటి శీను, రేగేటి సాయి కృష్ణ, ఎం. నాగరాజు, కే. దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply