కోచింగ్ సెంటర్ల పేరుతో భారీ దోపిడీ దందా..

కోచింగ్ సెంటర్ల పేరుతో భారీ దోపిడీ దందా..
విద్యార్థుల ఆశలతో విద్యా వ్యాపారం!
ఫీజుల పేరుతో తల్లిదండ్రుల జేబులు గుల్ల!
అనుమతులు లేకుండా కోచింగ్ వ్యాపారం..
షార్ట్ టర్మ్ కోర్సుల పేరిట భారీ వసూళ్లు
ఉద్యోగాల ఆశలపై భారీగా ఫీజుల దందా..
ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న అధికారులు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు : ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే ఇఎపిసెట్‌లో మంచి ర్యాంకు సాధించడం అత్యవసరం. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని తల్లిదండ్రులు కలలు కంటూ ఉన్నారు. అయితే ఈ ఆశలనే కొందరు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఆకర్షణీయ ప్రకటనలు, తప్పుడు హామీలతో విద్యార్థులను ఆకర్షిస్తూ భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. కోచింగ్ సెంటర్లలో అవసరమైన వసతులు కూడా ఉండడం లేదు. అర్హత కలిగిన బోధన సిబ్బంది ఉండటం లేదు. పైన జింకు సీట్లు, టెంకాయ బట్టలు వేసి కోచింగ్ సెంటర్లుగా నడుపుతున్నారు. కూర్చోవడానికి ఫర్నిచర్, తాగడానికి నీరు, బాత్రూమ్, యూరినర్స్ వంటి సౌకర్యాలు కూడా ఉండడం లేదు. అరకురా వసతులతో, అర్హత లేని సిబ్బందితో కోచింగ్ సెంటర్లను నడుపుతూ విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో చిత్తూరు, బంగారుపాలెం, పలమనేరు, కుప్పం, గంగాధర నెల్లూరు, నగరి, ఇతర ప్రాంతాలలో 150 వరకు కోచింగ్ సెంటర్లు ఉండవచ్చని అంచనా. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తరువాత ఇఎపిసెట్‌కు కేవలం 40 నుండి 50 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ సమయాన్ని షార్ట్ టర్మ్ కోచింగ్ పేరిట క్యాష్ చేసుకుంటున్నారు. సమయం తక్కువ.. వెంటనే చేరండి.. ర్యాంకు ఖాయం అంటూ విద్యార్థులను, తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నారు. ప్రముఖ ఫ్యాకల్టీ తమ దగ్గర ఉన్నట్లు ప్రచారం చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక్కో పట్టణంలోనే డజన్ల సంఖ్యలో సెంటర్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ప్రభుత్వ అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఒక్కో సెంటర్ ఒక్కో విధంగా ఫీజు నిర్మాణాన్ని అమలు చేస్తోంది. షార్ట్ టర్మ్ కోర్సులకు రూ.6 వేల నుండి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. హాస్టల్ వసతుల కోసం రోజుకు రూ.150 నుండి రూ.250 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇంకా కొన్ని కోచింగ్ సెంటర్లు ప్రత్యేక ప్యాకేజీల పేరుతో కోచింగ్‌తో పాటు హాస్టల్ సదుపాయాలను కలిపి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందుతుందా లేదా అన్నది తెలియక తల్లిదండ్రులు అయోమయంలో పడుతున్నారు. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను టార్గెట్ చేస్తూ కోచింగ్ సెంటర్లు ప్రత్యేకంగా వల వేస్తున్నాయి.

అలాంటి విద్యార్థులు తమ దగ్గర చేరితే మంచి ర్యాంకులు వస్తాయని ప్రచారం చేసి వారి ప్రతిభను తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. కొంతమంది నిర్వాహకులు ఇంటర్ కాలేజీలతో కుమ్మక్కై విద్యార్థులను నేరుగా తమ సెంటర్లకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కోచింగ్ సెంటర్లలో అడ్మిషన్ తీసుకున్న వెంటనే పూర్తి ఫీజు చెల్లించాల్సిందేనని నిబంధనలు పెడుతున్నారు. మొత్తం ఫీజు చెల్లించకపోతే తరగతులకు అనుమతించబోమని హెచ్చరిస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుండి రూ.20 వేలకుపైగా వసూలు చేస్తున్నారు. ఒకేసారి ఫీజు చెల్లిస్తే కొంత రాయితీ ఇస్తామని చెప్పి మరింత ఆకర్షిస్తున్నారు. ఇదే పరిస్థితి ఉద్యోగాల కోచింగ్ సెంటర్లలో కూడా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేయడంతో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తోంది. దీనిని అవకాశంగా మార్చుకున్న నిర్వాహకులు ఫీజులను ఒక్కసారిగా పెంచేశారు. గతంలో రూ.15 వేలుగా ఉన్న పోలీస్ కోచింగ్ ఫీజు ఇప్పుడు రూ.20 నుంచి రూ.25 వేల వరకు పెరిగింది. గ్రూప్-1 కోచింగ్ ఫీజులు రూ.50 వేల నుండి రూ.70 వేల వరకు పెరిగాయి.
గ్రామీణ ప్రాంతాల నుండి వేలాది మంది నిరుద్యోగులు జిల్లా కేంద్రాలకు వచ్చి కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. అయితే ఈ సెంటర్లలో కనీస సదుపాయాలు కూడా లేవని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో క్లాస్‌లో వందల మంది విద్యార్థులను కూర్చోబెట్టి బోధించడం వల్ల సరైన అవగాహన కలగడం లేదని చెబుతున్నారు. అదనంగా, ఫ్యాకల్టీ అర్హతల వివరాలను కూడా కోచింగ్ సెంటర్లు వెల్లడించడం లేదు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని చెబుతున్నా వాస్తవానికి ఆ వివరాలు బయటకు రావడం లేదు. కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ప్రైవేట్ సెంటర్లలో పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1982 విద్యా చట్టం ప్రకారం అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్లు నడపకూడదు. ప్రతి తరగతిలో పరిమిత సంఖ్యలో విద్యార్థులను మాత్రమే చేర్చాలి.
అయితే ఈ నిబంధనలను చాలా సెంటర్లు ఉల్లంఘిస్తున్నాయి. అయినా అధికారుల నుంచి ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత కోచింగ్ అందిస్తున్నప్పటికీ అందులో పరిమిత సీట్లు మాత్రమే ఉండటం వల్ల ఎక్కువ మంది ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. అందుకే ప్రభుత్వమే ప్రతి కళాశాలలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిరుద్యోగులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి అనుమతులు లేని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని, ఫీజులను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న ఈ వ్యాపార దందా మరింత విస్తరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

