జిల్లాలో జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్‌కు శ్రీకారం..

జిల్లాలో జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్‌కు శ్రీకారం..
ప్రభుత్వ సంస్థల్లో చెత్త నిర్వహణకు సమగ్ర కార్యాచరణ ప్రారంభం..
40 రోజుల్లో చెత్త రహిత సంస్థల లక్ష్యం..
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో “జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్” చెత్త రహిత సంస్థలు కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని దేవనగర్‌లో “జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ” థీమ్‌తో నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. పురపాలక ప్రాథమిక పాఠశాల వరకు సాగిన ఈ ర్యాలీలో కలెక్టర్ స్వయంగా పాల్గొని పరిశుభ్రత ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కంపోస్ట్ పిట్‌ను ప్రారంభించి, దాని నిర్వహణపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థల్లో చెత్త నిర్వహణను శాస్త్రీయంగా, క్రమబద్ధంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 1363 ప్రభుత్వ పాఠశాలలు, 1663 అంగన్‌వాడీ కేంద్రాలు, 153 సంక్షేమ వసతి గృహాలతో సహా సహా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఈ కార్యక్రమంలో చేర్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి సంస్థలో మూడు రకాల డస్ట్‌బిన్‌ల ద్వారా చెత్తను వేర్వేరుగా సేకరించడం జరుగుతోందన్నారు. తడి చెత్తను కంపోస్ట్ పిట్‌లలో ఎరువుగా మార్చడం, పొడి చెత్తను వేరు చేసి విక్రయించడం ద్వారా ఆదాయం పొందవచ్చన్నారు. ప్రమాదకర చెత్తను సురక్షితంగా మున్సిపాలిటీ,పంచాయతీకి అప్పగించేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు.

పాఠశాలల్లో విద్యార్థులకు చెత్త విభజన, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, ఇంటి వద్ద కంపోస్టింగ్ విధానాలపై అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామీణ స్థాయిలో ఉపాధి హామీ పథకం (MGNREGS) మరియు స్వయం సహాయక బృందాల (SHGs) ద్వారా కంపోస్ట్ తయారీని ప్రోత్సహిస్తూ, కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని 40–45 రోజులలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రభుత్వ సంస్థలు పరిశుభ్రంగా, పర్యావరణ అనుకూలంగా మారడమే కాకుండా ప్రజల్లో కూడా బాధ్యతాయుతమైన చెత్త నిర్వహణపై అవగాహన పెరుగుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

