నాణ్యతలో రాజీ పడొద్దు..

నాణ్యతలో రాజీ పడొద్దు..
నిర్ణీత సమయంలో పనులు పూర్తి కావాలి..
దేవాదాయ శాఖ కమిషనర్ కే రామచంద్ర మోహన్
ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులపై ఉన్నతస్థాయి సమీక్ష..
ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడ లోని ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ కే రామచంద్ర మోహన్ ఆదేశించారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు శనివారం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్, చీఫ్ ఇంజనీర్ జి.వి.ఆర్. శేఖర్‌తో కలిసి ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న వివిధ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టంగా ఆదేశించారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా పనులను ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేకంగా నాలుగవ అంతస్తులో నిర్మాణంలో ఉన్న మహా మండపం పనులపై కమిషనర్ దృష్టి సారించారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ పర్యటనలో ఆలయ ఈఓ సీనా నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ కమిషనర్, ఏఈఓలు, సూపరింటెండెంట్లు తదితర అధికారులు పాల్గొన్నారు. నిర్దేశిత గడువులోగా అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి, భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో చర్యలు చేపట్టాలని కమిషనర్ అధికారులను దిశానిర్దేశం చేశారు.
కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్..
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వసంతోత్సవాలలో భాగంగా కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కే రామచంద్ర మోహన్ దర్శించుకున్నారు. ఆలయ ఈవో శీనా నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.
