ఇంద్రకీలాద్రిపై వైభవం గా పుష్పాలంకరణ..

ఇంద్రకీలాద్రిపై వైభవం గా పుష్పాలంకరణ..
మూడవ రోజు చామంతి–గులాబీ పూలతో కనకదుర్గమ్మకు అద్భుత అలంకరణ
భక్తులతో కిటకిటలాడిన దేవస్థానం
ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడ లోని ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న పుష్పాలంకరణ వేడుకలు మూడవ రోజు శనివారం అత్యంత వైభవంగా కొనసాగాయి. పుష్పాల సోయగంతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో తళుక్కుమంది. అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా అమ్మవారిని చామంతి, గులాబీ, గన్నేరు పూలతో శోభాయమానంగా అలంకరించారు. వివిధ వర్ణాల పుష్పాలతో తీర్చిదిద్దిన ఈ అలంకరణ అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని మరింత ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దింది. దర్శనార్థం వచ్చిన భక్తులు ఈ పుష్పాలంకరణను చూసి భక్తి పరవశంలో మునిగిపోయారు.

ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ సీనా నాయక్ పాల్గొని, అమ్మవారికి పూలు సమర్పించి ప్రత్యేక ఆర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతటా వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నాదాలతో భక్తి వాతావరణం నెలకొంది. పుష్పాలంకరణ వేడుకల సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు పుష్పాలతో అలరారుతున్న దుర్గమ్మను దర్శించుకుని పునీతులయ్యారు.పుష్పాలంకరణ సేవలో పాల్గొనడం ద్వారా మనశ్శాంతి, ఐశ్వర్యం, అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా చామంతి, గులాబీ వంటి పవిత్ర పుష్పాలతో చేసే అలంకరణ అమ్మవారికి ప్రీతిపాత్రమైనదిగా భావిస్తున్నారు.
