విజయవాడ అభివృద్ధికి అడ్డంకి గా వైసిపీ..

విజయవాడ అభివృద్ధికి అడ్డంకి గా వైసిపీ..
త్వరలో పీడ విరగడ కాబోతుంది
ఎంపీ కేశినేని శివనాధ్
ఆంధ్రప్రభ, పటమట : రాజధాని అమరావతి ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న విజయవాడ నగర అభివృద్ధికి అడ్డంకి కార్పొరేషన్ లో వైసీపీ పార్టీ అని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) అన్నారు. రాష్ట్రానికి పట్టిన పీడ వైసిపి ఏడాదిన్నర క్రితం విరగడ అయిందని, మరో రెండు రోజుల్లో విజయవాడ నగరానికి పట్టిన వైసిపి పీడ విరగడ కాబోతుందని ఎంపీ చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని నాలుగో డివిజన్ వెటర్నరీ కాలనీలో… యూత్ హాస్టల్ ఖాళీ స్థలాన్ని స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తో కలసి పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్ని ఆదివారం పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు నేతృత్వంలో జరిగిన ఈ పరిశీలన అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ… రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విజయవాడ నగర అభివృద్ధికి కూటమి పార్టీ ప్రజా ప్రతినిధులుగా కృషి చేస్తున్నామన్నారు.

కానీ కార్పొరేషన్ పాలక పక్షంగా ఉన్న వైసిపి అడుగడుగునా విజయవాడ నగర అభివృద్ధికి అడ్డుపడుతుందని చెప్పారు. నగర అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం చేస్తే కౌన్సిల్లో ఆమోదించడానికి కూడా వైసిపి ఒప్పుకోలేదు అన్నారు. నగరంలో ప్రజలకు ఉపయోగపడే రోడ్లు వేయడానికి కూడా వైసీపీ పాలకపక్షం అడ్డుపడిందన్నారు. రోడ్లకు పేర్లు పెట్టుకోవడానికి, అందిన కాడికి దోచుకోవడానికి వైసిపి ప్రజాప్రతినిధులు చూశారన్నారు. ఇక విజయవాడ నగరానికి మోక్షం వచ్చిందని, మరో రెండు రోజుల్లో వైసిపి పెత్తనం కార్పొరేషన్ లో ముగుస్తుంది అన్నారు. స్పెషల్ అధికారి పాలనలో ప్రభుత్వం ఆధీనంలోకి కార్పొరేషన్ వస్తుందని చెప్పారు. విజయవాడ నగర అభివృద్ధికి ఇక అడ్డంకి తొలగినట్టే నని, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు రాబోయే 30 సంవత్సరాల పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా విజయవాడ నగర అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. ప్రత్యేకించి యు జి డి, స్ట్రాం వాటర్ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి వసతి, రహదారుల నిర్మాణం తదితర ప్రజా అవసరాల పై ముందుగా దృష్టి సారిస్తామన్నారు.

ఆ క్రమంలోనే ప్రస్తుతం వెటర్నరీ కాలనీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్థలాన్ని నగర ప్రజలకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పరిశీలన చేస్తున్నామని వివరించారు. విజయవాడ నగరంలో ఖాళీ స్థలాల కొరత ఉందని, ఇక్కడ ఉన్న ఖాళీ స్థలాన్ని ఆటస్థలంగా, వాకింగ్ ట్రాక్లు, వివిధ క్రీడా కోర్టులు ఏర్పాటు చేసుకునేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ… నగర వాసులకు ఉపయోగపడేలా స్థలాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ స్థలంలో గతంలో యూత్ హాస్టల్ భవనం ఉండేదని, భవనం శిధిలావస్థకు చేరడంతో ఇటీవల కూల్చి వేయడం జరిగింది అన్నారు. ఆ స్థలంలో భారీ నిర్మాణాల కాకుండా వివిధ రకాల క్రీడా కోర్టులు, వాకింగ్ ట్రాక్, చిన్నపిల్లలు ఆడుకునేలా ఆట పరికరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, స్థల పరిరక్షణకు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ ఖాళీ స్థలాన్ని ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని స్థానికుల అభిప్రాయానికి గౌరవం ఇచ్చి స్థల పరిశీలనకు వచ్చిన పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాద్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ కాలనీ, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ తదితర కాలనీలకు చెందిన పెద్దలు నల్లూరి సుబ్బారావు, స్వర్ణ ఆంజనేయులు, మలినేని రంగ ప్రసాద్, ఎలమంచిలి ఉమామహేశ్వరరావు, కరణం మోహన్, వెంకటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

