announcement | కుప్పం సమగ్ర అభివృద్ధి

announcement | కుప్పం సమగ్ర అభివృద్ధి

  • ప్రజారోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధిపై సీఎం చంద్ర‌బాబు ప్రకటన
  • ప్రజావేదిక నుంచి ముఖ్య‌మంత్రి ప్రసంగం

announcement | కుప్పం, ఆంధ్రప్రభ : కుప్పం నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం ప్రజావేదిక సభలో పాల్గొని ఆయ‌న ప్రసంగించారు. వ్యవసాయం నుంచి ఆరోగ్యం వరకు, నీటి వనరుల వినియోగం నుంచి పరిశ్రమల స్థాపన వరకు ప్రతి రంగంలో సమగ్ర చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. రైతులు సేంద్రియ సేద్యం వైపు మొగ్గు చూపాలని ఆయన పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, ప్రజారోగ్యాన్ని కాపాడాలంటే ఆరోగ్యకర ఆహారం ఉత్పత్తి చేయడం అవసరమని చెప్పారు. సేంద్రీయ పద్ధతులు అవలంబిస్తే భూమి సారవంతం అవడంతో పాటు ప్రజల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వివరించారు.

ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా “సంజీవని” ప్రాజెక్టును అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. ఇప్పటికే కుప్పంలో ఈ ప్రాజెక్టును పైలెట్‌గా ప్రారంభించామని, రోగులు మొబైల్ ఫోన్ల ద్వారానే డాక్టర్ల అపాయింట్‌మెంట్లు పొందే విధానం తీసుకొచ్చామని చెప్పారు. నాణ్యమైన వైద్య సేవలను ప్రజల గుమ్మం ముందుకు తీసుకురావడమే లక్ష్యమని, ప్రజారోగ్యంపై అవగాహన కార్యక్రమాలు కూడా ఈ ప్రాజెక్టులో భాగమని తెలిపారు. 2026 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని ప్రకటించారు.

ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలను ప్రోత్సహిస్తూ విద్యుత్ ఖర్చు తగ్గించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడమే దీని ఉద్దేశమన్నారు. నీటి వనరుల విషయంలో కూడా కీలక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం వివరించారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను రైతులకు అందిస్తున్నామని తెలిపారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు లింక్ కెనాల్స్, చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నామని చెప్పారు. నీటి ప్రవాహ మార్గాల్లో ఆక్రమణలు లేకుండా ప్రజలు సహకరించాలని కోరారు.

కుప్పంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో పారిశ్రామిక రంగంలో కొత్త దశ ప్రారంభమవుతోందని సీఎం అన్నారు. రూ. 7,088 కోట్ల పెట్టుబడులతో 16 పరిశ్రమలు రానున్నాయని, వాటి ద్వారా 34 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ప్రత్యక్ష, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు. కుప్పం నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు తగ్గేలా స్థానికంగానే ఉపాధి సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఆదిత్య బిర్లా సంస్థతో కలిసి మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించామని చెప్పారు. వేర్వేరు రంగాల్లో పనిచేసే వారికి కోవర్కింగ్ స్పేస్ సదుపాయం కల్పించామని వివరించారు.

పర్యాటక రంగంపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని సీఎం తెలిపారు. కంగుంది ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి రాక్ క్లైంబింగ్ పార్క్‌గా తీర్చిదిద్దామని చెప్పారు. ఫ్లవర్ ఫెస్టివల్ ద్వారా కుప్పానికి పర్యాటక ప్రవాహం పెరిగిందని, హోం స్టేలను అభివృద్ధి చేసి స్థానికులకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. వన్ ఫ్యామిలీ–వన్ ఎంట్రప్రెన్యూర్ పథకం ద్వారా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దుతున్నామని, డ్వాక్రా మహిళలు కూడా వ్యాపార రంగంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లక్ష మందిని పారిశ్రామికవేత్తలుగా తయారుచేయడమే లక్ష్యమని తెలిపారు. ఫార్మర్ ప్రోడ్యూసర్స్ ఆర్గనైజేషన్ల ద్వారా రైతులు ఆదాయం పెంచుకోవచ్చని చెప్పారు.

కుప్పం నియోజకవర్గాన్ని ఒక ప్రయోగశాలగా భావిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఇక్కడ విజయవంతమైన ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం భరోసా ఇస్తుందని, వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 నాటికి దేశం అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, సంపదతో పాటు నీతి, నిజాయితీలో కూడా కుప్పం నెంబర్ వన్ నియోజకవర్గంగా మారాలని తన ఆకాంక్షని వ్యక్తం చేశారు.

Leave a Reply