చౌడమ్మది ఆత్మహత్య కాదు.. పోస్ట్ మార్టం రిపోర్ట్…!!!

చౌడమ్మది ఆత్మహత్య కాదు.. పోస్ట్ మార్టం రిపోర్ట్…!!!

హత్య అని ముందే చెప్పిన ఆంధ్రప్రభ…
డాక్టర్ల రిపోర్టులో బయటపడిన నిజాలు
తల్లితండ్రులతోపాటు సోదరుడు, బంధువర్గం లోని మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు

మాచర్ల, ఆంధ్రప్రభ : అనుకున్నదే జరిగింది.. ఆంధ్రప్రభ అనుమానమే నిజమైంది. ప్రేమ వివాహం మూన్నాళ్ళ ముచ్చటగానే ముగిసింది. తాను ప్రేమించిన వ్యక్తితోనే వివాహం జరిగిందని ఎన్నో కలలతో, మరెన్నో ఆశలతో పోలీసుల వద్దకు చేరిన ఆ జంటను విడదీసి కర్కశంగా మృత్యువు చెంతకు చేర్చారు. ప్రేమ పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చిన చౌడమ్మను, నాగరాజు లకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు చౌడమ్మకు రెండు రోజుల గడువు పెట్టి తల్లి దండ్రులతో పంపారు.

ప్రేమ పెళ్లి తెచ్చి పెట్టిన మృత్యువు…

మాచర్ల పట్టణానికి చెందిన కామనబోయిన చౌడమ్మ(21), గంగ బోయిన నాగరాజు కొన్నాళ్ళుగా ప్రేమలో ఉండి ఇంటి నుంచి వెళ్ళిపోయి గత నెల 13వ తేదీన తాడేపల్లి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలలో చౌడమ్మ తండ్రి చంద్ర శ్రీను తన కూతురుని రెండు రోజులు తన దగ్గరకు పంపాలని పోలీసులను వేడుకోవడంతో చౌడమ్మ వెళ్లేందుకు నిరాకరించింది. తాము మేజర్లమని, పెళ్లి చేసుకున్నామని తాను భర్తతోనే వెళ్తానని కరాఖండిగా చెప్పింది. సీఐ వెంకటరమణ రెండు రోజులు ఇంటికి వెళ్లి రమ్మని, తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి జరిపిస్తానని హామీ ఇచ్చి చౌడమ్మను తండ్రితో పంపించారు .

మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కు రావలసిన చౌడమ్మ గత నెల అనగా మార్చి 18న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చౌడమ్మ మృతిపై అనుమానం వ్యక్తపరుస్తూ మార్చి 20వ తారీఖున “ఆత్మహత్యా.. పరువుహత్యా” అనే శీర్షికన ఆంధ్రప్రభలో కథనం ప్రచురితమైంది. ఆంధ్రప్రభ అనుమానం వ్యక్తపరిచినట్లుగానే చౌడమ్మది ఆత్మహత్య కాదని మార్చి 31న డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు.

అయితే పోస్టుమార్టం రిపోర్ట్ ను పోలీసులు వెల్లడించేందుకు ఇష్టపడటం లేదు. డాక్టర్ల రిపోర్టు ఆధారంగా చౌడమ్మ తల్లిదండ్రులతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. నవ వధువును నిర్ధాక్షిణ్యంగా కాటికి పంపిన వ్యవహారంలో పాత్రలు, పాత్రదారులు ఎవరనేది తేలాల్సి ఉంది.

Leave a Reply