హాజరైన ప్రముఖులు

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా దసరా పండుగ తర్వాత రోజున నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ‘ఆపరేషన్ సింధూర్’ థీమ్‌తో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేధావాల్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రిటైర్డ్ సీజేఐ ఎన్వీ రమణ, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రఘునందన్ రావు, సినీ ప్రముఖులు నాగార్జున, బ్రహ్మానందం, సుద్దాల అశోక్ తేజ ఉన్నారు.
ఈ వేదికపై మేజర్ జనరల్ అజయ్ మిశ్రాను సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు తగిన సమాధానమని, ఈ ఆపరేషన్ కేవలం 28 గంటల్లోనే పూర్తయిందని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ ‘టెర్రరిజంతో చర్చలు ఉండవు’ అనే సందేశాన్ని స్పష్టం చేశారని పేర్కొన్నారు.
అనంతరం హీరో నాగార్జునను సన్మానించగా, ఆయన మాట్లాడుతూ.. ఇది చాలా కొత్తగా ఉంది. ఇరవై ఏళ్లుగా అలయ్ బలయ్‌ని నిర్వహిస్తున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా నడుస్తుంది. ఇలా అందరూ ఒకే వేదిక మీదకు రావడం మాకు కాన్ఫిడెన్స్‌ను ఇస్తుందని పేర్కొన్నారు. అలాగే హాస్యనటుడు బ్రహ్మానందంను కూడా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రేమను పంచుకునే కార్యక్రమం అలయ్ బలయ్. అందరినీ ఒకచోట చేర్చి నిర్వహిస్తున్న దత్తాత్రేయకి అభినందనలని అన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘మనందరం సోదరులం, బంధువులం. దేశంలో కులం, మతం, వర్గం పేరుతో కొందరు చిచ్చు పెడుతున్నారు. దేశంలో ఐక్యత ఉంది, నేపాల్ లాంటి పరిస్థితి దేశంలో లేదు’ అని వ్యాఖ్యానించారు. ఇక అదే వేదికపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దత్తాత్రేయ అజాత శత్రువు అని, ఆయనకు మంచి జరగాలని, వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. ‘ఐక్యతకు నిదర్శనం అలయ్ బలయ్. సామాన్యుడి సేవ చేయడమే దేవుడి సేవతో సమానం. మన సంస్కృతి అందరూ ఆనందంగా ఉండాలనే చెప్తుంది’ అని పేర్కొన్నారు.

