కర్ణాటకలో ఆదోనికి చెందిన బియ్యం సీజ్…

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని కర్ణాటక పోలీసులు రెండు రోజుల క్రితం సీజ్ చేసినట్లు తెలిసింది. ఆదోని నుంచి అహ్మదాబాద్‌కు 35 టన్నుల రేషన్ బియ్యంతో అక్రమంగా వెళ్తున్న లారీని కర్ణాటక రాష్ట్రం సింధనూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు.
ఎలాంటి రశీదులు లేకపోవడంతో లారీని సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉంటే బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఆదోని పట్టణంలోని నలుగురు కూటమి నాయకుల హస్తం ఉన్నట్లు సమాచారం.
లారీ డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు వారిపైనా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా సివిల్ సప్లై బోర్డు మెంబర్ మహేష్ ఆధ్వర్యంలో ఆదోనిలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుకున్న సంగతి విధితమే.
వీటిపై 6ఏ కేసు నమోదు చేసి భారీగా జరిమానా విధించారు. ఈ సంఘటన మరువక ముందే ఆదోనికి చెందిన రేషన్ బియ్యం, కర్ణాటకలో పట్టుబడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
