ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) కేంద్రంలోని రాజీవ్ గాంధీ మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ (రిమ్స్) Rajiv Gandhi Institute of Medical Sciences (RIMS) లో ఎంబిబిఎస్ సెకండ్ ఇయర్ విద్యార్థి సాహిల్ చౌదరి (Sahil Chaudhary) (23) హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య (suicide)కు పాల్పడ్డాడు.
2023-24 బ్యాచ్ కు చెందిన సాహిల్ రాజస్థాన్ (Rajasthan) లోని జైపూర్ జాట్ తెగకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. రిమ్స్ బాయ్స్ హాస్టల్ లో ఉండి ఎంబీబీఎస్ చదువుతున్న సాహిల్ తన హాస్టల్ గదిలో నుండి సహచర విద్యార్థులు బయటకు వెళ్లగానే ఇవాళ గదికి తలుపులు బిగించి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఘాతుకానికి పాల్పడ్డాడు. హాస్టల్ గదిలోని విండో కర్టెన్లను తాడుగా మల్చుకుని ఫ్యానుకు బిగించి ఉరివేసుకున్నట్టు తెలుస్తోంది.
వెంటనే మెడికో విద్యార్థులు సాహిల్ ను ఎంసీయూఐకి తరలించగా.. అప్పటికే శ్వాస ఆగిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కాగా ఆగస్టు 2 వతేదీ నుండి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ పరీక్షలు ఉండడంతో ఆ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. అతని వద్ద లభించిన సెల్ ఫోన్ ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. పూర్తి వివరాలు ఇప్పుడే ఏం చెప్పలేమని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. ఈ విద్యార్థి ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు అన్ని పాసై ఉన్నాడని, యాక్టివ్ గా ఉంటాడని ఆత్మహత్య మిస్టరీగానే ఉందని తెలిపారు. రాజస్థాన్ నుండి మెడిసిన్ కోర్స్ కోసం ఇక్కడికి వచ్చి తనువు చాలించడం దిగ్భ్రాంతిగా ఉందని డైరెక్టర్ తెలిపారు.