జన్నారం, (ఆంధ్రప్రభ) : జన్నారం డివిజనల్ కవ్వల టైగర్ రిజర్వ్‌లోని జన్నారం ఫారెస్ట్ బీట్‌లో… గడ్డంగూడ వద్ద అక్రమంగా వేసిన గుడిసెలను తొలగించడానికి వెళ్లిన నలుగురు అటవీ అధికారులపై గుడిసెలు వేసుకున్న పలుకురు గిరిజనులు దాడికి పాల్పడ్డారు.
ఆ రిజర్వ్ ఫారెస్ట్‌లో కొంతమంది గిరిజనులు 25 సంవత్సరాల క్రితం గుడిసెలు నిర్మించుకున్నారు, కానీ రెండు నెలల క్రితం అటవీ అధికారులు వాటిపై దాడి చేసి 22 గుడిసెలను తొలగించారు. అదే ప్రాంతంలో మళ్లీ గిరిజనులు గుడిసెలు వేసుకోగా, పది రోజుల క్రితం కవ్వాల టైగర్ రిజర్వ్ ఎఫ్డీపీటీ, మంచిర్యాల సీఎఫ్ శాంతారాం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అయితే మళ్ళీ అదే ప్రాంతంలో గిరిజనులు గుడిసెలు వేసుకున్నారు.
దీంతో మంచిర్యాల డీఎఫ్ఓ, స్థానిక ఇన్చార్జ్ ఎఫ్డీఓ శివ్ ఆశిష్ సింగ్ ఆదేశాల మేరకు.. తాళ్లపేట రేంజ్ ఆఫీసర్, జన్నారం ఇన్చార్జ్ వి.సుష్మారావు, ఇందనపల్లి రేంజ్ ఆఫీసర్ కారం శ్రీనివాస్ నేతృత్వంలోని పలువురు అటవీ అధికారులు శుక్రవారం ఉదయం జన్నారం అటవీ అభయారణ్యంలోని గడ్డంగూడ ప్రాంతానికి వెళ్లారు.
అప్పటికి, అక్కడ గుడిసెలు వేసుకున్న పలువరు గిరిజనులు… ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు కృష్ణారావు, లాల్ భాయ్, తిరుమలేష్, బేస్ క్యాంప్ స్టాఫ్ వెంకట కృష్ణపై దాడి చేశారు. స్థానిక ఇన్-చార్జ్ రేంజ్ ఆఫీసర్ సుష్మా రావు జన్నారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దాడిలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారని, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారని ఆమె చెప్పారు. సాయంత్రం స్థానిక SI గుండేటి రాజవర్ధన్‌ను సంప్రదించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.