ADB | 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ఉమ్మ‌డి ఆదిలాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని బోరజ్ జాతీయ రహదారి చెక్ పోస్ట్ వద్ద మధ్యప్రదేశ్‌కు అక్ర‌మ‌ రవాణా అవుతున్న రేష‌న్‌ బియ్యం లారీని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది రేషన్ బియ్యమేనని సివిల్ సప్లై అధికారులు నిర్ధారించారు.

హైదరాబాద్ టూ బాలాఘాట్ అక్రమ రవాణా
మధ్యప్రదేశ్‌లో రేషన్ బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు అడ్డూ అదుపు లేకుండా మహారాష్ట్ర మీదుగా అక్ర‌మంగా బియ్యం రవాణా చేస్తూ దండిగా డ‌బ్బులు సంపాదిస్తున్నారు. హైదరాబాదు నుండి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం మీదుగా మధ్యప్రదేశ్ లోని బాలా ఘాట్ కు రేషన్ బియ్యం తరలిస్తుండగా పోలీసులకు అందిన సమాచారం మేరకు బోరజ్ చెక్ పోస్టు వద్ద నిఘా పెంచారు. లారీలో ఒక్కో బ్యాగులో 99 కేజీ ల రేషన్ బియ్యం, పై భాగంలో ఒక కేజీ పోర్టిఫైడ్ రైస్ కలిపి ఎవరు గుర్తుపట్టని రీతిలో బియ్యం ర‌వాణా సాగుతున్నట్టు డీఎస్‌పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. వీటి విలువ రూ. 9 లక్షల పైనే ఉంటుందని, రెండు నెలల వ్యవధిలోనే రెండు బియ్యం లారీలను తాము పట్టుకున్నట్టు సీఐ సాయినాథ్ వివరించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ కవిత, సివిల్ సప్లై అధికారి వాజిద్ శాంపిలను పరిశీలించి ఇది రేషన్ బియ్యం గా నిర్ధారించినట్టు పోలీసులు వివరించారు. ఈ మేరకు డ్రైవ‌ర్‌, త‌హీర్ తో ఇద్దరినీ అరెస్ట్ చేశామని, సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *