ఏపీకి న్యాయం చేయాలి.. హామీలు వెంటనే నెరవేర్చాలి..

ఏపీకి న్యాయం చేయాలి.. హామీలు వెంటనే నెరవేర్చాలి..
కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ ఇన్చార్జి వల్లూరు భార్గవ్
విభజనతో ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రానికి కేంద్రం పూర్తి సహాయం చేయాలి..
అమరావతిని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించి నిధులు కేటాయించాలి
విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌కు విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, రాష్ట్రానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు వల్లూరు భార్గవ్ డిమాండ్ చేశారు. 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ద్వారా రాష్ట్రం తన రాజధాని, ఆదాయ వనరులు, అభివృద్ధి కేంద్రాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ చేసిన త్యాగానికి ప్రతిఫలంగా కేంద్రం ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని విమర్శించారు. అమరావతి నిర్మాణానికి పూర్తి నిధులు ఎక్కడున్నాయో, పరిశ్రమల ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఎందుకు అమలు కావడంలేదో ప్రశ్నించారు.
ఆలస్యం, అయోమయం, నిర్లక్ష్యం మాత్రమే కనిపిస్తున్నాయని అన్నారు. అమరావతిని విడతల వారీగా కాకుండా, పూర్తి స్థాయిలో ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి లభించినట్లే జాతీయ స్థాయి మద్దతు అమరావతికి ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేసిన ఆయన, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మాత్రం మౌనం పాటించబోమన్నారు.
రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకముందు భూముల సేకరణ కొనసాగించరాదని హెచ్చరించారు. అమరావతిని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించి పూర్తి నిధులు కేటాయించాలని, చట్టంలోని సెక్షన్ 94ను సంపూర్ణంగా అమలు చేయాలని, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పరిశ్రమల ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు, కేంద్ర పెట్టుబడులు వెంటనే అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చిన న్యాయం వెంటనే చేయాలని వల్లూరు భార్గవ్ స్పష్టం చేశారు.
