TG | తరలిపోయిన ఏసీబీ ఆఫీస్.. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాలకు షిఫ్ట్​

  • ఏసీబీ డైరెక్టర్​ నుంచి ఆకస్మిక ఉత్తర్వులు
  • ఆ రెండు జిల్లాలకు సమీపంలో ఏర్పాటు
  • ఈ నెల 8న ప్రారంభించేందుకు సన్నాహాలు

ఉమ్మ‌డి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : ఉమ్మడి జిల్లాకు సేవలందించి అవినీతిపరుల్లో గుండె దడ పుట్టించిన అవినీతి నిరోధక శాఖ కార్యాలయాన్ని మంచిర్యాలకు తరలించారు. సుమారు 35 సంవత్సరాల పాటు ఆదిలాబాద్ కేంద్రంగా కైలాస్ నగర్ లో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న ఏసీబీ డీఎస్‌పీ ఆఫీసును మంచిర్యాల జిల్లా కేంద్రానికి తరలించాలని ఏసీబీ డైరెక్టరేట్ నుండి వచ్చిన ఉత్తర్వుల మేరకు గురువారం ఇక్కడి ఆఫీసును మంచిర్యాలకు షిఫ్ట్ చేశారు. ఏసీబీ డీఎస్‌పీ ఛాంబర్ తో పాటు ఆఫీసు ఫర్నీచర్ ను వ్యాన్ లో ఎక్కించి మంచిర్యాలకు షిఫ్ట్ చేశారు.

మూడు ద‌శాబ్దాల‌కు పైగా…

మూడు దశాబ్దాలకు పైగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఏసీబీ డీఎస్‌పీ, సిబ్బంది ఇక్కడే విధులు నిర్వర్తించేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏసీబీ డీఎస్పీ ఆఫీస్, సిబ్బంది క్వార్టర్ల కోసం ఆదిలాబాద్ కైలాసనగర్ 348 సర్వే నంబర్ లో 16 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కూడా కేటాయించింది. జిల్లాల పునర్విభజన అనంతరం ఆదిలాబాద్ కేంద్రం అన్నింటికీ దూరంగా ఉండడం, మరోవైపు ఇక్కడ డీఎస్ఫీ, ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, కానిస్టేబుళ్ళు, మరో ఏడెనిమిది మంది సిబ్బంది కోసం ఆఫీసు నిర్వహించడం కష్టసాధ్యంగా భావించి మంచిర్యాలకు షిఫ్ట్ చేసినట్టు తెలిసింది. ఏసీబీ కేసుల్లో పట్టుబడిన నిందితులను 24 గంటల లోపు కరీంనగర్ కోర్టుకు తరలించడం ఇబ్బందిగా మారినట్టు అధికారులు భావించారు. హడావుడిగా ఏసీబీ ఆఫీస్ మంచిర్యాలకు తరలించడం చర్చనీయాంశంగా మారింది.

8న మంచిర్యాలలో ప్రారంభం…

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు దగ్గరగా వీలు కలిగే విధంగా మంచిర్యాలలో కొత్తగా ఏసీబీ డీఎస్పీ ఆఫీస్ ఈనెల 8న ప్రారంభం కానుంది. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ తరుణ్ జోషి ఆఫీస్ ను ప్రారంభించనున్నట్టు సమాచారం. ఆఫీసు తరలింపు వల్ల ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఇక దూర భారం కానుంది. ముందుగా తెలిస్తే ప్రజా ప్రతినిధులు అడ్డుకునే అవకాశం ఉండడంతో గుట్టు చప్పుడు కాకుండా తరలించడం గమనార్హం. అదేవిధంగా గతంలో ప్రభుత్వం కేటాయించిన ఏసీబీ ఆఫీసు ఖాళీ స్థలం అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉంది. దీనికి వెంటనే ప్రహరీ గోడ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆఫీసు తరలింపు నిజమే : డీఎస్‌పీ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఇంతకాలం పనిచేసిన ఏసీబీ డీఎస్‌పీ ఆఫీసు ఇక మంచిర్యాల కేంద్రంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వర్తించనున్న‌ట్లు డీఎస్‌పీ విజ‌య‌కుమార్ తెలిపారు. అయితే ఆదిలాబాద్ ఆఫీసును మాత్రం పూర్తిగా షిఫ్ట్ చేయలేదని చెప్పారు. ఇక్కడ ఓ కానిస్టేబుల్, హోంగార్డ్ పనిచేస్తార‌న్నారు. మంచిర్యాల డీఎస్పీ పరిధిలో ఉమ్మడి జిల్లా కార్యకలాపాలు కొనసాగిస్తామ‌ని చెప్పారు.

Leave a Reply