బెంగళూరు: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫుడ్ డెలివరీ రంగంలోకి కొత్త పోటీదారు అడుగుపెట్టింది. బైక్ టాక్సీ సేవలకు పేరుగాంచిన రాపిడో, ఇప్పుడు రాపిడో ఓన్లీ అనే ప్రత్యేక ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ అనే యాప్‌ను ప్రారంభించింది. బుధవారం ఈ యాప్‌ను అధికారికంగా లాంచ్ చేస్తూ, తొలి దశలో బెంగళూరులో సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
మొదట బెంగళూరులో..
ర్యాపిడో ఓన్లీ సేవలు ప్రారంభ దశలో బైరసండ్ర, తవరేకేరీ, మడివాలా లేఅవుట్, హోసూర్-సర్జాపుర రోడ్, కోరమంగళ ప్రాంతాల్లో టెస్టింగ్ రూపంలో అందుబాటులో ఉంటాయి. ఈ సేవలను అమలు చేయడానికి ర్యాపిడో Ctrlx టెక్నాలజీస్ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది.
ధరలో పోటీ, రెస్టారెంట్లకు తక్కువ భారము
కంపెనీ ప్రకారం, ర్యాపిడో ఓన్లీ డెలివరీ ఛార్జీలు ప్రస్తుతం మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న జొమాటో, స్విగ్గీ కంటే సుమారు 15% తక్కువగా ఉంటాయి. అదేవిధంగా రెస్టారెంట్లపై ఎక్కువ కమీషన్ వసూలు చేయకుండా, స్థిరమైన తక్కువ ఫీజుతో సేవలను అందించనున్నట్లు తెలిపింది.
యాప్ అందుబాటు & డెలివరీ సౌకర్యాలు
Rapido Ownly యాప్ ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ర్యాపిడోకు ప్రస్తుతం ఉన్న 10 మిలియన్ వాహనాలను ఈ సేవలకు వినియోగించనుంది. సమయాన్ని, ఖర్చును తగ్గించేందుకు సమీప ప్రాంతాల ఆర్డర్లను మాత్రమే డ్రైవర్‌లకు కేటాయించే విధానం అమలు చేయనుంది.