పీటీడీ కమిషనర్ బాధ్యతలూ ఆయనకే
సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఆర్టీసీ వీసీ, ప్రజా రవాణా కమిషనర్‌గా ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావును ప్రభుత్వం నియమించింది. గతంలో జారీ చేసిన జీవో 210ని సవరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ తాజాగా 411 జీవో జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
గత నెల 31న డీజీపీ, ఆర్టీసీ ఎండీగా ఉద్యోగ విరమణ చేసిన తిరుమలరావును ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా ఏడాది పాటు నియమిస్తూ జీవో 210ని ప్రభుత్వం జారీ చేసింది.
రాష్ట్ర రవాణా, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఎఎస్ అధికారి కాంతిలాల్ దండాను పీటీడీ కమిషనర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో నియమిస్తూ జీవో 26ను జారీ చేసింది. కాంతిలాల్ దండేను కమిషనర్‌గా నియమించడంతో తిరుమలరావు పాత్ర ఆర్టీసీ ఎండీగా మాత్రమే పరిమితమైంది.
ఉద్యోగుల సంక్షేమం, ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా పీటీడీ కమిషనర్ నిర్వహించాల్సి ఉంటుంది. అంటే తిరుమలరావు పాత్ర బస్సుల నిర్వహణ, గ్యారేజీల పరిశీలనకే అధికారికంగా పరిమితమయ్యారు.
కాగా, తాజా ఉత్తర్వులతో గతంలో మాదిరిగానే ఆర్టీసీ వైఎస్ ఛైర్మన్, పీటీడీ కమిషనర్ బాధ్యతలను ఎండీ తిరుమలరావు నిర్వహించనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.