- భక్తులతో కిటకిటలాడిన రాంలీలా మైదానం
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో వెలసిన శ్రీపడమటి ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారి పాల ఉట్ల వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన పాల ఉట్ల కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
భారీ ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలోని రాంలీలా మైదానం కిటకికలాడింది. జిల్లా నలుమూలల నుండే కాకుండా ముంబాయి, పూణే, షోలాపూర్, ఆంఫర్ నాథ్, హైదరాబాద్, ఆదోని, యాదగిరి, రాయిచూర్ వంటి సుదూర ప్రాంతాలనుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
భారీ ఎత్తున తరలి వచ్చిన భక్తులను నియంత్రించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. పోలీసులు వివిధ ధార్మిక సంస్థల సభ్యులు నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. కోరిన కోరికలు తీర్చే స్వామిగా శ్రీపడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని రాంలీలా మైదానంలో ఏర్పాటుచేసిన 30 అడుగుల ఉట్ల స్తంభానికి పాల ఉట్లను కట్టారు. స్తంభానికి నీరు చెల్లె సమయంలో భక్తులు పాల ఉట్లను కొట్టేందుకు ప్రయత్నించారు. భక్తులు పలుమార్లు కింద పడి ఉట్లు కొట్టేందుకు విఫల యత్నం చేశారు.
భక్తుల గోవిందనామ స్మరణ మధ్య కేరింతల మధ్య భక్తులు 10వ సారి ఉట్ల స్తంభాన్ని విజయవంతంగా ఎక్కి పాల ఉట్లను కొట్టారు. దీంతో భక్తులు కేరింతలు కొడుతూ పెద్ద ఎత్తున గోవింద నామస్మరణ చేశారు. రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి, జై శ్రీరామ్ జైజై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో రామ్ లీలా మైదానం ప్రాంతమంతా హనుమంతుడి నామస్మరణతో మార్మోగిపోయింది. అనంతరం స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పి.ప్రాణేశాచారి, కార్యనిర్వహణాధికారి కవిత, మాజీ ఎంపిపి బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ పి.నర్సింహా గౌడ్, వివిధ పార్టీల నాయకులు భక్తులు పాల్గొన్నారు.

