MLA | పిన్నెల్లి బ్రదర్స్ కు షాక్
మధ్యంతర బెయిల్ రద్దు
కొత్త పిటిషన్లూ సుప్రీం తిరస్కణ
MLA | నరసరావుపేట, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే, పల్నాడు (Palnadu) జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి లకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పిన్నెల్లి బ్రదర్స్ దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అంతే కాకుండా పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలం, గుండ్లపాడు గ్రామంలో జరిగిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు జంట హత్యల కేసులో మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ… గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. వారిని వెంటనే అరెస్టు చేసేందుకు ఎలాంటి అనుమతులు కూడా అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో కస్టోడియల్ దర్యాప్తు తప్పనిసరి అని పేర్కొంది. అయితే వారు కోర్టులో లొంగిపోయేందుకు రెండు వారాలు సమయం కూడా ఇచ్చింది. దీనిని బట్టి చూస్తే పిన్నెల్లి సోదరులు అరెస్టు కాక తప్పదని స్పష్టమవుతుంది. ఇది ప్రస్తుతం పల్నాడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

