Jupally | ఆడపడుచుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం..

Jupally | ఆడపడుచుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం..
మంత్రి జూపల్లి కృష్ణారావు
Jupally | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : సామాజిక ఆర్థిక సాధికారికతలో మహిళలకు ఎవరూ సాటిరారని, ఆడబిడ్డల సంక్షేమమే ప్రాధాన్యంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర సంస్కృతిక, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు.
సోమవారం ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి, ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం అనుకుంట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్న భాస గంగమ్మకు చీర, సారె వస్త్రాలు పంపిణీ చేసి ఇందిరమ్మ గృహాన్నిమంత్రి ఎంపీ గోడం నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజార్షి షా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మహిళలు గృహాలకు పరిమితం కాకుండా ఆర్థిక సమాజ నిర్మాణంలో కీలక పాత్ర (key role) పోషిస్తున్నారని గుర్తుచేశారు. మహిళలు గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు ఇప్పటికే లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని మంత్రి వెల్లడించారు. మహిళల ఆదాయ వనరులను పెంపొందించేందుకు, యజమానులను చేసేందుకు ఆర్టీసీ బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ పంపుల ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందువల్ల కుటుంబ ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
4.5 లక్షల ఇందిరమ్మ గృహాలకు కార్యాచరణ..
రాష్ట్రంలో గూడు లేని పేదల కోసం 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ. 22 వేల కోట్లు కేటాయించామని, ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (Free electricity) సరఫరా చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని పొదుపు సంస్కృతి అలవర్చుకోవాలని సూచించారు.
బొట్టుపెట్టి.. ఇందిరమ్మ చీరల పంపిణీ..!
అనంతరం కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ చీరల (Indiramma sarees) పంపిణీతో పాటు మహిళా సంఘాలకు రూ. 21.83 స్వయం శక్తి రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. ఆదిలాబాద్ లోని కైలాసనగర్లో రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించిన దివ్యాంగుల సంక్షేమ భవనాన్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు.
రూ.3.55కోట్లతో బీటీ రోడ్లకు శంకుస్థాపన..!
అదిలాబాద్ జిల్లా (Adilabad District) సోనాల మండల కేంద్రంలో ఎస్టి ఎస్డిఎఫ్ పథకం కింద గుడిహత్నూర్ నుండి లింగాపూర్, మల్కాపూర్ వరకు బీటీ రోడ్డు పనులకు మంత్రి జూపల్లి భూమిపూజ చేశారు. రూ.93లక్షల అంచనాతో సోనాలలో సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా అక్కడి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంత్రి జూపల్లిని మర్యాదపూర్వకంగా కలిసి అభివృద్ధి పనుల గురించి వివరించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీబీ చైర్మన్ బోజరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, శ్యామలాదేవి, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్, డీఆర్‌డీఓ రవీందర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
