Kurnool | పోలీసు జీపు నాదే

మందు బాబు వీరంగం
ఆలూరు పోలీసులు ఆశ్చర్యం

Kurnool | కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : కర్నూలు జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్‌లో వింత ఘటన. మద్యం మత్తులో పోలీసు జీపును ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి
కర్నూలు జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్‌లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి నేరుగా పోలీసు జీపును ఇంటికి తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

బుధవారం రాత్రి ఆలూరులో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పెద్దహోతూరు గ్రామానికి చెందిన యువరాజు(Yuvaraju) పోలీసుల చెరలో పట్టుబడ్డాడు. తన బైక్ ఇవ్వాలని, ఇంటికి వెళ్లి వస్తానని పట్టుబడిన తర్వాత పోలీసులు అనుమతించకపోవడంతో, మరో బైక్ తీసుకొని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

ఉదయం తిరిగి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువరాజు, “నా బైక్ ఇస్తే వెళ్తా… లేకుంటే పోలీస్ జీప్‌ను తీసుకెళ్తా” అని అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.

అతడు మద్యం మత్తులో ఉన్నందున, పోలీసులెవ్వరూ అతని మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఇదే సమయంలో చెప్పినట్టుగానే స్టేషన్ పరిధిలో ఉన్న సీఐ జీప్‌ను నడిపి యువరాజు పెద్దహోతూరు గ్రామానికి చేరుకున్నాడు.

తరువాత మత్తు తగ్గిన సమయంలో, పోలీస్ జీప్ ఇంటి వద్ద ఉన్నట్టు గుర్తించిన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే యువరాజు సోదరుడు అంజి(Anji) జీపును తిరిగి ఆలూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చాడు.

ఈ ఘటన బయటకు రావడంతో, స్థానికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే, ఇలాంటి ఘటన ఏదీ జరగలేదని సీఐ రవిశంకర్ స్పష్టీకరించారు.

Leave a Reply