FARMERS | సహకార బ్యాంకులు రైతులకు అండగా నిలవాలి

72వ అఖిలభారత సహకార వారోత్సవాలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

FARMERS | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఎరువులు, విత్తనాల సరఫరాతో పాటు రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో సహకార బ్యాంకులు చొరవ చూపి సహకార బ్యాంకులంటే రైతుల బ్యాంకులుగా పేరు తెచ్చుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు. బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని వవ్వేరు కో ఆపరేటివ్ బ్యాంక్ లో నిర్వహించిన 72 వ అఖిలభారత సహకార వారోత్సవాలలో ఆమె ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కో ఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో రాష్టంలో బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని వవ్వేరు సహకార బ్యాంక్ కు విశిష్ట స్థానం ఉందని ప్రశంసించారు. దాదాపు 6,500 మంది సభ్యులకు సంబంధించిన కోటి 88 లక్షల 67 వేల రూపాయల షేర్ క్యాపిటల్‌తో నిర్వహించే వవ్వేరు కో ఆపరేటివ్ బ్యాంక్ రూ.145 కోట్ల 27 లక్షల టర్నోవర్ సాధించడం అభినందనీయమన్నారు.

2024 – 25 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.2 కోట్ల 85 లక్షల నికర ఆదాయం ఆర్జించడం వెనుక వవ్వేరు సహకార బ్యాంక్ సిబ్బంది, సభ్యుల కృషి ఉందన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్య‌త్తులో వవ్వేరు సహకార బ్యాంక్ మరింత అభివృద్ధి సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ధాన్యం ఆరబెట్టుకునే కల్లాలు, నిల్వ చేసుకునే గోదాములు లేక రైతులు నష్టపోతున్నారని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కల్లాలు, గోదాములు నిర్మించేందుకు సహకార బ్యాంకులు ముందుకు రావాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సూచించారు. కల్లాలు, గోదాముల నిర్మాణానికి బుచ్చి మండలంలోని మినగల్లు, పెనుబల్లి వద్ద ప్రభుత్వ భూములున్నాయని ప్రజా దర్బార్ సందర్భంగా రైతులు తన దృష్టికి తెచ్చిన విషయాన్ని ఆమె వవ్వేరు, బుచ్చి కో ఆపరేటివ్ అధికారులకు తెలిపారు.

అన్నదాతలకు అండగా ఉండాలన్న తన లక్ష్య సాధనకు సహకార బ్యాంకులు తమ వంతు సహకారం అందివ్వాలని కోరారు. చిన్న సన్నకారు రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎకరాకు 3 బస్తాల యూరియా అందించేలా యూరియా కార్డుల విధానాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. కౌలు రైతులకు సైతం యూరియా కార్డులు అందిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో గత 20 ఏళ్లుగా పూడికలు తీయని సాగునీటి కాలువలలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా సిల్ట్ క్లియరెన్స్ చేపట్టిన విషయాన్ని ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎక్కడైనా సాగునీటి కాలువలలో పూడిక సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. గత రబీ సీజన్‌లో ధాన్యం సేకరించిన 24 గంటలలో హమాలీ కూలీలతో సహా రైతుల ఖాతాలలో వేసి కూటమి ప్రభుత్వం ఆదుకుందన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తెచ్చి ఈ సారి ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం ప్రభుత్వమే సేకరించేలా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ప్రత్యామ్నాయ పంటల గురించి రైతులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే వ్యవసాయ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ అధికారి గుర్రప్ప, వవ్వేరు కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్ పర్సన్ దొడ్ల విజయలక్ష్మి,ఎం బుచ్చి అగ్రికల్చర్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మెన్ ఏటూరి శివరామ కృష్ణారెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, సహాకార బ్యాంకుల డైరెక్టర్లు పాల్గొన్నారు.

Leave a Reply