- గత 16 నెలల్లో ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి
- ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ఏకైక అజెండా
- ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది
- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకు వెళ్తున్నాం
- సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌పై ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్
ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌పై ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ — విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌కు మిమ్మల్ని ఆహ్వానించేందుకు ఇక్కడకు వచ్చానని తెలిపారు.
రాష్ట్రం కోసం “యువగళం” పేరుతో 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఆ పాదయాత్రలో ఎదురైన అనేక సంఘటనలు తనను తీర్చిదిద్దాయని చెప్పారు. పాదయాత్ర సమయంలో గంగాధర నెల్లూరులో మోహన అనే మహిళతో మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించారు. ఆమె భర్త మద్యానికి బానిసై చనిపోయాడని, రోడ్డు పక్కన బజ్జీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని తెలిపిందని వివరించారు.
ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారని అడిగినప్పుడు.. తన ఇద్దరు పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని కోరిందని లోకేష్ తెలిపారు. ఆ సమయంలో యువత అంతా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారని చెప్పారు.

గత 16 నెలల్లో ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి
ఎన్నికల సమయంలో మేము ఆరు హామీలు ఇచ్చాం. మొదటి హామీ… కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం. ఇది కేవలం లక్ష్యం మాత్రమే కాదు.. యువతకు ఇచ్చిన ప్రమాణం. దేశంలో ఏ రాష్ట్రం ఇప్పటివరకు చేపట్టని ఎంప్లాయ్మెంట్ విజన్ఇ ది. అందుకే మేము రూపొందించిన ప్రతి పాలసీ ఉద్యోగాల సృష్టికోసమే. ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండాగా పెట్టుకున్నాం. గత 16 నెలల్లో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి.
ఇవి కేవలం సంతకాలకే పరిమితమైన ఎంవోయూలు కావు.. ఇవి నిజమైన ప్రాజెక్టులు. కొన్ని ప్రాజెక్టులకు ఎంవోయూలు కూడా కుదుర్చుకోలేదు. ఉదాహరణకు ఆర్సెలర్ మిట్టల్.. దేశంలో అతిపెద్ద ఉక్కు కర్మాగారం. ఆర్సెలర్ మిట్టల్‌తో మేము ఎలాంటి ఎంవోయూ చేసుకోలేదు. ఆదిత్య మిట్టల్‌తో ఒక్క జూమ్ కాల్ ద్వారానే ఆ సంస్థ వచ్చింది. మరో ఉదాహరణ గూగుల్. దేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి.. గూగుల్ డేటా సిటీ.. విశాఖకు వచ్చింది.
దేశంలోని ప్రముఖ 10 సోలార్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీల్లో 5 సంస్థలు ఏపీని ఎంచుకున్నాయి. బీపీసీఎల్ లక్ష కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్రాజెక్ట్‌ను స్థాపిస్తోంది. ఎన్టీపీసీ రూ.1.65 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను అభివృద్ధి చేస్తోంది.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం
ఈ పెట్టుబడుల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయనేదే ముఖ్యం. విశాఖలో జరిగే పార్టనర్షిప్ సమ్మిట్‌లో కూడా పెట్టుబడులకు వేగవంతమైన సౌకర్యాల కల్పన కోసం ఏపీని ఎంచుకోవాలనే థీమ్‌తో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడుల వేగం ఎంతో పెరిగింది. స్థానిక కంపెనీలు, ఎంఎస్ఎంఈలు కూడా వెయ్యి కోట్లకు పైగా క్యాపిటల్ ఎక్స్‌పాంషన్ చేస్తున్నాయి.
నెల రోజులు ఆలస్యం అయినా మొత్తం బిజినెస్ ప్లాన్ మారిపోతోంది. “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అనేది చాలా ముఖ్యం. ఆ విధానాల వల్లనే పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. అందుకే టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలు వచ్చాయి. ఇది కేవలం ఐటీ రంగానికే కాదు… బ్లూ కాలర్ ఉద్యోగాలు, హాస్పిటాలిటీ రంగాల వరకు విస్తరించింది. పర్యాటక రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించిన తొలి రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. వచ్చే మూడేళ్లలో 50 వేల హోటల్ గదులు సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఏపీలో నమో (NAMO) ప్రభుత్వం ఉంది
పెట్టుబడిదారులు ఏపీని ఎందుకు ఎంచుకోవాలో మూడు కారణాలు చెబుతాను.. ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది సమర్థవంతమైన నాయకత్వం. మూడోది పరిపాలన. సీఎం చంద్రబాబునాయుడు కి అనుభవం, మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండగా, ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఏపీలో “నమో” (NAYUDU + MODI) ప్రభుత్వం ఉంది.
వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని తెలిపారు. ఈ కారణాల వల్ల యువ పారిశ్రామికవేత్తలు ఏపీని ఎంచుకుంటున్నారని చెప్పారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహణకు ఏపీకి అవకాశం ఇచ్చినందుకు సీఐఐకి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారితో సీఐఐకి మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు.
పెట్టుబడిదారులు, పాలసీ మేకర్లు, ప్రభుత్వం, ప్రజలందరూ కలిసి భవిష్యత్ అవకాశాలను పరిశీలించే వేదికగానే ఈ సమ్మిట్ జరగనుందని చెప్పారు. క్వాంటమ్, ఏఐ, మెటీరియల్ సైన్స్ రంగాల్లో భవిష్యత్ అవకాశాలను పరిశీలించనున్నారు. 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం 410 ఒప్పందాలు కుదుర్చుకోనుంది. వీటి ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ఈ సమ్మిట్‌కు హాజరవుతారని తెలిపారు. మొత్తం 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, 12 అంతర్జాతీయ సంస్థలు, జీ20 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సదస్సులో మొత్తం 48 సెషన్లు, ఒక ప్లీనరీ, 27 సాంకేతిక సెషన్లు, 3 స్టాండ్అలోన్ సెషన్లు, 11 రాష్ట్ర పరమైన సెషన్లు ఉంటాయి.
ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం
పార్టనర్షిప్ సమ్మిట్ జరిగే సమయంలో రూ.2.7 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, అప్పుడే దేశం విజయం సాధిస్తుందని చెప్పారు. ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారని, క్లస్టర్ల వారీ విధానంలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు.

