అచ్చంపేట, (ఆంధ్రప్రభ) : జాతీయ రహదారి 765 (హైదరాబాద్–శ్రీశైలం) ను రేపటిలోగా పూర్తిగా అందుబాటులోకి తీసుకువచ్చి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించనున్నామని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టీహెచ్) హైదరాబాద్ రీజినల్ ఆఫీసర్, చీఫ్ ఇంజనీర్ కృష్ణ ప్రసాద్ తెలిపారు.
శుక్రవారం ఆయన ఎస్‌ఈ ధర్మారెడ్డి తో కలిసి డిండి వాగు అలుగు వద్ద.. వరద ప్రభావంతో కూలిపోయిన రెండవ వంతెనను పరిశీలించారు. మూడు రోజులుగా కొనసాగిన తుఫాను వర్షాల కారణంగా హైవే తీవ్రంగా దెబ్బతిందని, అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.
ఎస్‌ఎస్‌ఆర్ కాంట్రాక్టర్ పవన్ కుమార్ రెడ్డి, ఆయన బృందం నిరంతర శ్రమతో తాత్కాలికంగా దెబ్బతిన్న భాగాలను పునరుద్ధరిస్తున్నారని, శనివారానికి రోడ్డు రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
అంచనాలకు మించిన వరద ఉధృతి కారణంగా హైవే దెబ్బతిన్నదని చెబుతూ, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను తట్టుకునేలా రహదారిని బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో డిఈఎన్ రమేష్ బాబు, ఏఈ చంద్రకాంత్ రెడ్డి, కాంట్రాక్టర్లు పవన్ కుమార్ రెడ్డి, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


