శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమా?
గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని సింగరేణి ఏరియా ఆస్పత్రి(Singareni Area Hospital) వద్ద ఈ రోజు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శిశువు మృతికి వైద్యులే కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. గోదావరిఖని సెవెన్ ఎల్ బీ(Seven LB) కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు కాంపల్లి లింగయ్య కుమార్తె సుప్రియను మొదటి కాన్పు కోసం ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం వైద్యులు స్కాన్ చేసి గర్భంలో శిశువు మృతి చెందిందని తెలిపారు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో స్కాన్ యంత్రం ఉన్నప్పటికీ, బయట స్కాన్ సెంటర్(Scan Centre) నుండి స్కాన్ చేయించుకోవలసి వచ్చిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సకాలంలో సరైన చికిత్స అందకపోవడమే శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనా స్థలంలో ఆగ్రహంతో కుటుంబీకులు ఆస్పత్రిలో ఆందోళనలు చేపట్టారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది, అధికారులు, పోలీసులు(Police), సింగరేణి ఎస్ అండ్ పీసీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

