బీహార్లో ఎన్నికల హీటు !
- ఎన్నికల ముందు భారీగా మద్యం, నగదు, డ్రగ్స్ పట్టివేత
బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఓటర్లను ఆకర్షించడానికి మద్యం, డబ్బు పంచుతున్నారు. అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి, వివిధ ఏజెన్సీలు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 64.13 కోట్ల విలువైన మద్యం, నగదు, మత్తు పదార్థాలు (డ్రగ్స్), ఉచిత బహుమతులు స్వాధీనం చేసుకున్నాయి.
బీహార్లో మద్యం నిషేధం ఉన్నప్పటికీ.. రూ.23.41 కోట్ల విలువైన మద్యం దొరకడం గమనార్హం. ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, పట్టుబడిన వాటిలో రూ.14 కోట్ల ఉచిత బహుమతులు, రూ.16.88 కోట్ల మత్తు పదార్థాలు, రూ.4.19 కోట్ల నగదు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 753 మందిని అరెస్ట్ చేశారు.
ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా చూసేందుకు ఎన్నికల సంఘం (ECI) పోలీసు, ఎక్సైజ్, ఆదాయపు పన్ను తదితర శాఖలకు కఠిన ఆదేశాలు ఇచ్చింది. ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఫ్లయింగ్ స్క్వాడ్లు, నిఘా బృందాలు 24 గంటలు పనిచేస్తున్నాయి.
మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు పర్యవేక్షకులను (Observers) కూడా నియమించారు. మొదటి దశ నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 17తో ముగియగా, రెండవ దశ నామినేషన్ల దాఖలు అక్టోబర్ 20తో ముగియనుంది.