రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్పై డీజీపీ శివధర్ రెడ్డి
రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో ఎన్కౌంటర్ చేసినట్లు తెలిపారు. రియాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గది బయట ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీని లాక్కునేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు. తుపాకీతో పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించాడని, అదే సమయంలో ప్రజలు కూడా ఉండడంతో వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఎన్కౌంటర్ జరిపినట్లు డీజీపీ స్పష్టం చేశారు.
కానిస్టేబుల్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేషియా..
రౌడీ షీటర్ రియాజ్ కత్తితో దాడి చేయడంతో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమోద్ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేషియా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జీవో విడుదల చేశారు. అలాగే 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు వివరించారు. అంతేకాకుండా పోలీసు భద్రతా సంక్షేమం నుంచి రూ. 16 లక్షల ఎక్స్గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ. 8 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.