- ఖాళీ దిశలో దండకారణ్యం
- భద్రతా బలగాల రక్షణలో
- జగ్ధల్‌పూర్ వైపు పయనం
చర్ల / చింతూరు, ఆంధ్రప్రభ : దండకారణ్యంలో ఎర్రసైన్యం తెల్లజెండా ఎత్తింది. రెడ్ కారిడార్ ఖాళీ అవుతోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి బాటలో 140 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్దపడ్డారు. బస్తర్ రేంజ్ ఐజీ ముందు లొంగిపోవడానికి వాగులు, వంకలు దాటారు.
వివరాలు ఇలా ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం గురువారం రాత్రి జరగనుంది. మావోయిస్ట్ అగ్రనేత భూపతి దళానికి చెందిన మావోయిస్టులు అందరూ ఆయుధాలు విడిచి లొంగిపోవడానికి సిద్దమయ్యారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్, సీనియర్ సీఆర్పీఎఫ్ అధికారుల ముందు లొంగిపోవడానికి కాలినడకన బయలుదేరారు.
రూ. కోటి బహుమతితో పేరు మోసిన మావోయిస్ట్ నేత భూపతి లొంగిపోయిన తర్వాత ఆయన సహచరులు మొత్తం 120 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లాలో ని మావోయిస్టులను జగదల్‌పూర్‌కు భారీ భద్రతా బలగాల నడుమ తీసుకువస్తున్నారు. ఇది ఇప్పటివరకు దేశంలో జరిగిన అతిపెద్ద మావోయిస్టుల లొంగుబాటుగా భావిస్తున్నారు.
లొంగిపోయిన మావోయిస్టులు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ( డీకేఎస్‌జేడ్‌సీ) ప్రతినిధి రూపేష్ సహా 140 మంది వరకు ఉన్నారు. ఇప్పుడు, భూపతి బృందంలోని 120 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోతున్నారు.
బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నదికి ఆవల ఉన్న ఉస్పారి ఘాట్ వద్ద సమావేశమమై అక్కడ నుండి బయలుదేరారు. మావోయిస్ట్ సంస్థ వ్యూహాలను రూపొందించడంలో రూపేష్ కీలకపాత్ర పోషించారు. ఈ భారీ లొంగుబాటు దృష్ట్యా పోలీసులు, సీఆర్పీఫ్, కోబ్రా, డీఆర్జీ, ఇతర భద్రతా దళాలు ఈ ప్రాంతమంతా గట్టి భద్రతను ఏర్పాటు చేశాయి.
లొంగిపోయిన వారందరినీ తమ ఆయుధాలతో జగదల్‌పూర్‌కు తరలించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు బీజాపూర్ – జగదల్‌పూర్ మధ్య మొత్తం మార్గంలో అత్యాధునిక ఆయుధాలు కలిగిన సైనికులను మోహరించారు. మహారాష్ట్ర, అంతఘర్, సుక్మా తరువాత, బీజాపూర్‌లో మావోయిస్టు నిర్మూలన ప్రారంభమైందని పోలీసులు భావిస్తున్నారు.
లొంగిపోయే మావోయిస్టుల్లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, ఒక డీకేఎస్‌జడ్ కమిటీ సభ్యుడు, ఇద్దరు సౌత్ జోనల్ కమిటీ సభ్యులు, 15 మంది డీవీసీఎం సభ్యులు, ఏసీఎం క్యాడర్ , జన మీలిషీయా సభ్యులు మొత్తం 121 మంది కలుపుకొని 140 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు.
వీరందరూ జగదల్పూర్ చేరటానికి గురువారం అర్ధరాత్రి దాటిపోతుంది. వీరందరూ లొంగిపోయినట్టు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే గత రెండు రోజుల్లో దండకారణ్యంలోని 358 మావోయిస్టులు లొంగిపోయినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ట్విట్టర్ వేదికలో ప్రకటించారు.
ఇక మరి కొన్ని రోజుల్లో దండకారణ్యంలో మావోయిస్టుల జాడ ఉండదని, 2026 మార్చి ముందే కగార్ ఆపరేషన్ ముగుస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.





